ప్ర‌జ‌ల‌ను చైత‌న్యవంతులు చేయ‌డంలో జ‌ర్న‌లిస్టుల పాత్ర కీల‌కం

– దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

మార్కాపురం, మహానాడు: స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి వారిని చైత‌న్యం చేయ‌డంలో జ‌ర్న‌లిస్టుల పాత్ర కీల‌క‌మైన‌ద‌ని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం మార్కాపురం టౌన్ లో జరిగిన ప్రకాశం జిల్లా ఏపీయూడబ్ల్యూజే సమావేశం జరిగింది. లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు… విలేకర్ల‌కు జీతాలు ఉండ‌వ‌ని.. వారి అభిరుచి మేర‌కు జ‌ర్న‌లిస్టులు వృత్తిలో కొన‌సాగుతార‌ని తెలిపారు. దర్శి నియోజ‌క‌వ‌ర్గంలో తాను రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసిన‌ట‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు త‌న ప్ర‌యాణంలో జ‌ర్నలిస్టులు స‌హాయ స‌హ‌కారాలు అందించార‌ని గుర్తు చేసుకున్నారు.

స‌మాజంలో ఉన్న మంచి.. చెడుల గురించి త‌న‌కు తెలియ‌జేస్తూ.. అప్ర‌మ‌త్తం చేస్తూ.. పాజిటివ్ దృక్ప‌థంతో నియోజ‌క‌వ‌ర్గం బాగుకోసం తాను కృషి చేయ‌డంలో విలేక‌ర్ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని భరోసా ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాన్‌ నేతృత్వంలో 80 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం ముందుకు నడుస్తోందని చెప్పారు.

ఏపీడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర నాయకత్వంలో ఐవీ సుబ్బారావు లాంటి అనుభవజ్ఞులు కమిట్మెంట్ గా పనిచేయడం, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్ల‌బ్ భ‌వ‌న నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ కృషికి త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. చిన్న‌, పెద్ద ప‌త్రిక‌లు.. చిన్న‌, పెద్ద ఛాన‌ళ్లు అని సంబంధం లేకుండా వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టులంద‌రికీ నివేశ‌న స్థ‌లాలు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని, ఇళ్ళస్థలాల పంపిణీ పై మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోలేక చేతులెత్తేసిన తీరును గొట్టిపాటి లక్ష్మి గుర్తు చేశారు. కనీసం మీడియా సమావేశాలకు దూరం పాటించారని.. జగన్ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీతానై జర్నలిస్టులతో మాట్లాడేవారని.. మీడియాను గౌరవించని నాటి ప్రభుత్వ తీరు అందరికీ తెలుసునన్నారు.

కోవిడ్ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. గ‌త రాజ‌కీయ నాయ‌కుల మాదిరిగా జ‌ర్నలిస్టుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసే నైజం త‌న‌ది కాద‌న్నారు. జ‌ర్న‌లిస్టుల క‌ష్టాల‌లో తాను తోడుగా ఉంటాన‌ని… జ‌ర్న‌లిస్టులకు ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న కార్యాల‌యానికి వ‌చ్చి నేరుగా త‌న‌ను క‌ల‌వ‌చ్చ‌ని.. వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌న వంతు కృషి చేస్తానన్నారు. జ‌ర్న‌లిస్టుల‌కు ఉచిత వైద్యం అందిస్తాన‌ని.. దర్శిలో జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌కు మెగా వైద్య‌శిబిరం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యుడు ఉగ్ర నరసింహ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యుడు బి. న్. విజయ్ కుమార్, చీరాల శాసనసభ్యుడు ఎం. ఎం. కొండయ్య , శ్రీ దామచర్ల సత్య,యర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, తదితర నాయకులు పాల్గొన్నారు.