Mahanaadu-Logo-PNG-Large

మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

– మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి, మహానాడు: దేశ స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన తెనాలికి చెందిన ఏడుగురు అమరవీరులకు చిహ్నం గా ఏర్పాటు చేసిన స్థూపాలకు మంత్రి మనోహర్ ,అధికారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. తెనాలి పురపాల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

తొలిత స్థానిక గాంధీ చౌక్ నుండి ఎన్‌సీసీ క్యాడేట్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు జాతీయ జెండాను చేత పట్టుకుని ర్యాలీగా రణరంగ చౌక్ కు చేరుకున్నారు. అనంతరం భరతమాతకు వందన సమర్పణ చేసి అమరవీరుల స్థూపాలకు మంత్రి మనోహర్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, మున్సిపల్ చైర్ పర్సన్ తాడి బోయిన రాధిక, పలువురు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది.

క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏడుగురు అమరవీరులయ్యారు. స్వాతంత్రం కోసం అమరులైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఎక్కడ జరగనీ విధంగా ఈ రోజు అమరవీరుల స్థూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం.. ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నాం. స్వాతంత్రం కోసం గాంధీజీ పిలుపు మేరకు తెనాలి ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఆస్తులను కుటుంబాలను ప్రాణాలను త్యాగం చేశారు.. ఆ మహనీయులను స్మరించుకోవడం భారత పౌరులుగా బాధ్యత, మహనీయులన త్యాగాలను భావితరాలు గుర్తించుకోవాలి. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.