– కలెక్టరేట్ ఎదుట వీహెచ్‌పీ ధర్నా
గుంటూరు, మహానాడు: తిరుమల తిరుపతి ఆలయ పవిత్రతను కాపాడాలని, హిందూ దేవాలయాలను ప్రభుత్వం నుండి విముక్తి కలిగించి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదురుగా సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత స్థాయి విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యక్తులను శిక్షించాలని ధర్నా చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిరుమామిళ్ల గోపికృష్ణ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఖ్యాతి పొందినదని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం అని, కోట్లాది మంది హిందువుల మనోభావం అని అటువంటి హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా తిరుపతి లడ్డు లో వాడే నెయ్యి కల్తీ అయిందన్నారు. ఈ సంఘటన తెలియగానే హిందువులు మానసిక క్షోభ కు గురయ్యారని, అలా హిందువులను మానసిక క్షోభకు గురిచేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈ మధ్య మాజీ టీటీడీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఒక డ్రామాకు తెర లేపారని, ఆయన వెంకటేశ్వర స్వామి మహా భక్తుల్లాగా కోనేరులో ప్రమాణం చేయడాన్ని చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని విమర్శించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కాదా అన్యమత చిహ్నాలు పెట్టడానికి ప్రయత్నించింది… ఆయన కుమార్తె వివాహం కూడా అన్యమత సాంప్రదాయంలో కాదా చేసింది అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా దేవాలయాలను ఎండోమెంట్ అనే చర నుండి విముక్తి చేసి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు వెంకటప్ప రెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వరరావు, చక్కా హరినాథ్, అనిల్ బెహరా, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.