పూడికతీతలు, ఆక్రమణల తొలగింపుతోనే ముంపు సమస్యకు పరిష్కారం

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు: జనావాసాల్లో చోటుచేసుకున్న ఆక్రమణల తొలగింపు, డ్రెయినేజీల్లో పూడిక తీతతోనే భారీవర్షాల సమయంలో ముంపు సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శమన్నారు. గత నెల రోజులుగా ఆక్రమణలు తొలగిస్తుంటే అభ్యంతరాలు చెప్పిన వారే ఇప్పుడు ఫలితాలు చూసి అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారాయన.

కుండపోత కారణంగా చిలకలూరిపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పర్యటించారు. గడియార స్తంభం సెంటర్, కళామందిర్ సెంటర్, మార్కెట్‌ సెంటర్‌లో వరదనీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, డ్రైనేజీలు పరిశీలించి మున్సిపల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన 50 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షపాతం నమోదు కాలేదన్నారు. వాటికి తోడు గత పాలకుల నిర్లక్ష్యం, పట్టణాల అభివృద్ధిని గాలికి వదిలేయడం తో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోతోందన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పూడికతీత చేపట్టకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్లనే రాష్ట్రమంతా కొన్ని ప్రాంతాలు నీట మునిగాయన్నారు.

రెండు నెలలుగా సీఎం చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ చొరవతో పూడికతీతల కోసమే మున్సిపాలిటీలకు నిధులు కేటాయించడం, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పంచాయతీలకు కొంత నిధులు ఇవ్వడంతో పనులు జరిగి కొన్నిప్రాంతాల్లో ముంపు బారి నుంచి తప్పించుకున్నామన్నారు. చిలకలూరిపేటలో 2 నెలలుగా మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, సిబ్బంది డ్రైన్లలో పూడికతీయడం పనులు చేపట్టారని… వారిని అభినందించారు. డ్రైన్లలో పూడికతీత, ఆక్రమణల్లో ఉన్నవారు ఎవరికి వారు స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో పూడికతీయడం, కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి పూడికతీసినట్టు తెలిపారు.

రోడ్లకు ఇరువైపు కాస్త వెనక్కి జరిగితే ఎంత సౌకర్యంగా ఉంటుందో కూడా ఇప్పుడు ప్రజలందరికీ అర్థం అవుతోందన్నారు. ఆక్రమణల తొలగింపుతో పట్టణంలో కొంతమంది బాధపడ్డా మెజార్టీ ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. దీనిపై కూడా కొంతమంది తనపై దుష్ప్రచారం చేశారని, బాధతో మాట్లాడినవారు ఉన్నారని, వీటన్నింటినీ అర్థం చేసుకోవాలని కోరారు. మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు పట్టణంలో ఏ ఒక్కరూ ఇబ్బందిపడలేదంటే పట్టణ ప్రజల సహకారమే దీనికి ప్రధాన కారణమని, డ్రైనేజీల్లో పూడికతీయడం వల్లనే ఎక్కడా చుక్క నీరు నిలబడకుండా బయటకు వెళ్లిపోయిందన్నారు.

పట్టణంలో నీరు నిలబడిందని మీడియా తరఫున గానీ ప్రజల నుంచి గానీ తనకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు. ఏ డ్రైనేజీ చూసినా బ్రహ్మాండంగా పారుతుందన్నారు. దీనికి సహకరించిన పట్టణ ప్రజలను అభినందిస్తున్నానని, ఎవరూ నష్టపోవడానికి వీల్లేదని, జీవనోపాధి పొందడానికి అందరికీ సహకారం ఉంటుందన్నారు.