Mahanaadu-Logo-PNG-Large

నాటక రంగాన్ని కాపాడుకోవాలి

• విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహావిష్కరణ
• నాటకాలు సమాజంలోని మార్పునకు ప్రతిబింబాలు
• అభిమానులు, ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది
• మార్పును స్వాగతిస్తూనే.. పాత విధానాలను తర్వాతి తరాలకు అందించడం అవసరమే
• సమాజంలోని జాఢ్యాలను పారద్రోలేందుకు ప్రభుత్వాలతో పాటు కళాకారుల చొరవ మరింత పెరగాలి
• పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు

విజయవాడ: నాటకాలు సమాజంలోని పరిస్థితులను, వాస్తవ స్థితిగతులను ప్రతిబింబిస్తాయని, అలాంటి నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వరాజ్య ఉద్యమ కాలానికి ముందు నుంచి సమాజంలోని అనేక జాఢ్యాలను రూపు మాపటంలో నాటకాలు కీలక పాత్ర పోషించాయని, ఈ బాధ్యతను ప్రభుత్వాలకే వదిలేయకుండా కళాకారుల చొరవ మరింత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన, తెలుగు నాటక రంగం మీద తమదైన ముద్ర వేసిన వెంకటరత్నం తెలుగు నాటక ఖ్యాతిని భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికల మీద ఇనుమడింపజేశారని పేర్కొన్నారు. అభినవ దుర్యోధనుడిగా ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలు సొంతం చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని పేర్కొన్నారు.

అనేక భావజాలాలకు, అనేక సామాజిక ఉద్యమాలకు స్పందించడం, ఎప్పటికప్పడు సామాజిక వాస్తవికతను విమర్శనాత్మకంగా ప్రతిబింబించడం నాటకాల్లో మనకు కనపడుతుందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినిమా వచ్చాక నాటకం బలహీన పడిందని చాలా మంది అంటుంటారని కానీ తాను ఆ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. నాటక రంగం సింహావలోకనం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, సమాజాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందన్నారు.

‘మారే కాలంతోపాటే, మరెన్నో మార్పులు, ఇంకెన్నో ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మార్పును స్వాగతించడంతో పాటు, మంచి మార్పును తరతరాలకు నిలబెట్టుకోవలసిన అవసరం ఉంది’ అని ఆయన సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ప్రక్రియలో మార్పులు రావాల్సిందేనన్న వెంకయ్యనాయుడు, స్వరాజ్య ఉద్యమ కాలంలో ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని బలంగా నాటేందుకు నాటకాలు ఎంతగానో కృషి చేశాయని గుర్తుచేశారు.

మహాత్మాగాంధీని సైతం నాటకం ఎంతో ప్రభావితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సత్యహరిశ్చంద్ర నాటకం ద్వారా సత్యనిష్ఠ గొప్పతనాన్ని గాంధీజీ అలవర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. షణ్ముఖ నాట్యమండలిని స్థాపించి, తులసీ జలంధర, మైరావణ, కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయాలు తదితర నాటకాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న కళాభిమానులకు ఆచంట వెంకటరత్నం నాయుడు ఆనందాన్ని పంచారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, జలంధర, జరాసంధుడు, దుర్యోధనుడు, భీముడు, గయుడు, అశ్వత్థామ వంటి వందకు పైగా పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఒదిగిపోయి అనేక ప్రదర్శనలతో ప్రేక్షకాభిమానం సంపాందించుకుని జీవితాన్ని సార్ధకం చేసుకున్నారన్నారు.

అలాంటి మహనీయుల స్ఫూర్తిని కాపాడుకోవలసిన అవసరం ఉందన్న ఆయన, ఈ విగ్రహావిష్కరణ ద్వారా వారి ప్రేరణ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన రంగస్థల కళాకారులు తదితరులు పాల్గొన్నారు.