Mahanaadu-Logo-PNG-Large

జగన్‌ను గద్దె దించేందుకు నిరుద్యోగులు సిద్ధం

మంగళగిరిలో నిరుద్యోగ చైతన్య యాత్ర

మంగళగిరి టౌన్‌, మే 3: ఐదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్‌ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కి.మీ మేర కొనసాగుతున్న నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం మంగళగిరికి చేరుకుంది. నిరుద్యోగ జేఏసీ నాయకులు మంగళగిరి పట్టణంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలదండలు చేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం మాజీ సీఎం చంద్రబాబునాయుడిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌, నిరుద్యోగ చైతన్య యాత్ర కోఆర్డినేటర్లు అనిల్‌, గంగాధర్‌, భాను, రామశ్రీ, తవిటయ్య తదితరులు పాల్గొన్నారు.