ప్రజాకోర్టులో తీర్పువచ్చింది.. ఇక విశాఖ కోర్టులోనే తీర్పు రావాలి

– విశాఖ కోర్టుకు నా సొంత ఖర్చులతోనే వచ్చాను
– వైసీపీ రాసలీలల్లో అధికారులు కూడా భాగస్వాములు అయ్యారు
– సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్
– తదుపరి విచారణ అక్టోబర్ 18కి వాయిదా

విశాఖపట్నం, మహానాడు: ప్రజాకోర్టులో ఎన్డీయే కూటమికి బ్రహ్మాండమైన తీర్పు వచ్చిందని.. ఇక విశాఖ జిల్లా కోర్టులోనే తీర్పు రావాల్సి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సాక్షిపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం గురువారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 18కి వాయిదా వేసింది. “చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి” పేరుతో సాక్షి పత్రిక 2019 అక్టోబర్ 22న ఓ కథనం ప్రచురించింది. ఆ కథనంలో అవాస్తవాలు ఉన్నాయని, తన ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దిగజార్చారంటూ నారా లోకేష్ సాక్షి పత్రికపై రూ.75 లక్షలకు పరువునష్టం దావా వేశారు.

టీడీపీకి అధికారం కొత్త కాదు

కోర్టు విచారణ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నాపై సాక్షి విశాఖ ఎడిషన్ లో అవాస్తవాలతో కూడిన కథనం ప్రచురించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో తాను టీ, కాఫీల కోసం రూ.25 లక్షలు ఖర్చుచేశానని రాశారు. సాక్షి పత్రికలో పెట్టుబడులు మొత్తం వైఎస్ కుటుంబానివే. ఢిల్లీలో ఉన్న వీక్లీ మేగజైన్ కూడా అసత్యాలతో కూడిన కథనం ప్రచురించింది. దీనిపై ఆధారాలతో సహా ఇరువురికి లీగల్ నోటీసులు పంపించాను. బిల్లులు జనరేట్ అయిన 26 రోజుల్లో నేను ఒకే ఒక్క రోజు విశాఖలో ఉన్నానని స్పష్టంగా చెప్పడం జరిగింది. వీక్లీ మేగజైన్ తన తప్పుడు కథనంపై ఖండన వేశారు. క్షమించమని కోరారు. సాక్షి పత్రిక మాత్రం ఒప్పుకోలేదు. దీంతో రూ.75 లక్షలకు ఆ పత్రికపై పరువునష్టం దావా వేశాను. టీడీపీకి అధికారం కొత్త కాదు. ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని మా నాయకుడు చంద్రబాబునాయుడు పదేపదే చెబుతారు.

విశాఖ కోర్టుకు నా సొంత ఖర్చులతోనే వచ్చాను

గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలనే వినియోగించాను. వాటర్, టీ ఖర్చుకు కూడా నేను డబ్బులు చెల్లించాను. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత, ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే వచ్చాను. డీజిల్ ఖర్చు కూడా నా జేబు నుంచే చెల్లిస్తున్నాను. విమానానికి కూడా నా సొంత డబ్బులే ఖర్చు పెట్టాను. ఒక కప్పు కాఫీ తాగను, ఒక బాటిల్ నీళ్లు కూడా ప్రభుత్వం నుంచి ఏనాడూ తీసుకోలేదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విలువలు అవి. బుధవారం రాత్రి కూడా విశాఖ పార్టీ కార్యాలయంలో నా సొంత బస్సులోనే నిద్రించాను. జగన్ రెడ్డి మాదిరిగా ఫైవ్ స్టార్ హోటళ్లు మేం వినియోగించం.

సిగ్గులేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక తరపున వచ్చిన న్యాయవాదులు వాదనలు వినిపించడం చాలా బాధాకరం. చిన్నబాబు చిరుతిండి రూ.25 లక్షలంటూ కథనంలో ఆరేడుసార్లు నా పేరు ప్రస్తావించారు. ఆ డబ్బును చంద్రబాబుగారి అకౌంట్ లో వేశానని కూడా రాశారు. ఒక కథనం ప్రచురించే ముందు పరిశోధన చేయాలి. నా స్టాండ్ తీసుకుని ఉంటే వాస్తవాలు చెప్పేవాడిని. సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షిలో అసత్య కథనం ప్రచురించారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలనే డిఫమేషన్ సూట్ వేశాను.

జగన్ రెడ్డిలాగా నాకు ప్రజాధనం లూటీ చేయడం రాదు

జగన్ రెడ్డిలాగా నాకు ప్రజాధనం లూటీ చేయడం రాదు. దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ పెట్టారు. సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ కోసం సుమారు రూ.900 కోట్లు దుర్వినియోగం చేశారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఖర్చు చేశారు. నాడు-నేడు ఎప్పుడూ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ చేయదు. క్రమశిక్షణతో మేం మొదటి నుంచీ పనిచేస్తున్నాం. ప్రజల కోసం కష్టపడతాం.

వైకాపా రాసలీలల్లో అధికారులు కూడా భాగస్వాములు

చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టను అని నేను స్పష్టంగా చెప్పా. వైసీపీలో జరుగుతున్న రాసలీలల్లో అధికారులు కూడా ఇన్ వాల్వ్ అయ్యారని కథనాలు వచ్చాయి. వాటిపై ఎంక్వైరీ చేయాలి కదా. రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడుతున్నారు. నన్ను అడ్డుకునేందుకు గతంలో జీవో నెం.1 తీసుకువచ్చారు. మడిచి పెట్టుకోవాలని ఆనాడే చెప్పా. ఇవాళ రాష్ట్రంలో జగన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. విశాఖ రుషికొండ ప్యాలెస్ ను ఏవిధంగా వినియోగించుకోవాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

సంస్కరణలు ఏం తీసుకువచ్చినా పద్ధతి ప్రకారం చేస్తాం

గత ప్రభుత్వం నాడు-నేడు పేరుతో రూ.9వేల కోట్లు ఖర్చు చేసింది. పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు. ఇదంతా జగన్ రెడ్డి అసమర్థత వల్లే. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఐదేళ్లలో ఏం చేస్తామో ప్రజలముందు పెడతాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మదింపు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం. దీనిని ముందుకు తీసుకెళ్తాం. మన బడి-మన భవిష్యత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సీబీఎస్ఈ విధానంపై గత ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించాం. సమీక్షించి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. సంస్కరణలు ఏం తీసుకువచ్చినా పద్ధతి ప్రకారం చేస్తాం.

విశాఖను ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దుతాం

చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. పలువురు ఐటీ పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2019లో అదానీతో ఒప్పందం కుదుర్చుకుని సోలార్ ఎనర్జీ, డేటా సెంటర్ తీసుకువచ్చాను. ఆ రోజు ఎగతాళి చేశారు. ఇవాళ మహారాష్ట్రకు, తెలంగాణకు తరలివెళ్లాయి. అందరితో మళ్ళీ చర్చించాం. విశాఖను ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దుతాం. విశాఖలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూఅక్రమాలపై విచారణ పూర్తిచేసి నివేదికను తదుపరి కేబినెట్ లో పెడతాం. అన్ని భూఅక్రమాలు బయటకు తీస్తాం. జగన్ రెడ్డి మొదటి నిర్ణయమే ఏకపక్షంగా ప్రజావేదికను కూల్చారు. సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. లులూ ప్రాజెక్టును తరిమికొట్టారు. అందరినీ ఒప్పంచి పరిశ్రమలు తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజలకు సంక్షేమం కూడా అందిస్తాం.

విశాఖ స్టీల్ ను కాపాడతాం

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపడతామని హామీ ఇచ్చాం. కేంద్రంతో ఇప్పటికే చర్చించాం. దీనిపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల పరిశ్రమకు కష్టాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాలు జరిగాయి. అవన్నీ బయటకు తీస్తాం. అక్రమ కట్టడాలు ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఐదేళ్లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించాం.