మత పెద్దల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల
అమరావతి, మహానాడు: అమరావతి రాజధానితోనే ముస్లింల సంక్షేమం, భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రూపంలో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు, మౌలానా నయీం ఉర్ రెహ్మాన్ ఖాన్ రషాద్మి, ఆంధ్ర, తెలంగాణ జమియత్ ఉలేమా ఎ హింద్, ముస్లిం మైనారిటీ సంఘాల ఐక్య కార్యా చరణ సమితి నాయకులు తెలిపారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో అమరావతితోనే ముడిపడి ఉన్న ముస్లింల భవిష్యత్ అన్న కరపత్రాన్ని, మైనారిటీలపై జగన్ నిజస్వరూపం, ఇచ్చింది నవరత్నాలు కాదు నవమోసాలు అంటూ మరో రూపొందించిన మరో కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సమావేశంలో ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు మౌలానా నయీం ఉర్ రెహ్మాన్‌ఖాన్ రషాద్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు జగన్ నిజ స్వరూపాన్ని, ప్రజా రాజధాని అమరావతి ఆవశ్యకతను తెలియజేయాల్సిన బాధ్యత ముస్లిం మతపెద్దలపై ఉందన్నారు. రాష్ట్రంలో సుఖసంతోషాలు, శాంతిభద్రతలు, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారులకు వాణిజ్య వసతులు, చేతివృత్తి వారికి చేతినిండా పని లభించాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రతి మసీదు వద్ద ఈ రెండు కరపత్రాలు పంచాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ శిబ్లి, ముస్తి ఫారూఖ్, మౌలానా అబ్దుల్ జబ్బార్, హఫీజ్ అబ్దుల్ హమీజ్, మౌలా నా ఇస్‌హాస్ మదని తదితరులు పాల్గొన్నారు.