పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా…

వైసీపీ నేతల తీరు
ఏపీసీసీ చీఫ్  వైఎస్ షర్మిల రెడ్డి

అమరావతి, మహానాడు:  పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. వైసీపీ నాయకుల తీరు ఉందని ఏపీసీసీ చీఫ్  వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…  సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే, బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం.

వైసీపీ నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే… మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి. తల్లికి వందనం జీవో 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే .. కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది.

ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది? వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో, అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం.

15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని… జలయజ్ఞం పూర్తి చేస్తాం అని… ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా ? అని సవాల్ విసిరారు.