అప్పుడు రాతలు…ఇప్పుడు అడ్డగింతలు

నాడు సుభాషితాలు..నేడు విమ‌ర్శ‌లా?
చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై ఎందుకు రెండు నాల్క‌ల ధోర‌ణి
హైడ్రాకు అడ్డుప‌డితే జ‌నం చీత్క‌రించుకుంటారు
– మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం

హైద‌రాబాద్ :“చెరువులే మన భాగ్యవనరులు” అని ప‌త్రిక‌ల్లో మంత్రిగా వ్యాసాలు రాసిన హ‌రీష్ రావు గారు..హైద‌రాబాద్ లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఆవిర్బ‌వించిన హైడ్రా ను ఆడిపోసుకోవ‌డం విడ్డూరంగా ఉంది. నాడు చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై సుభాషితాలు ప‌లికి..ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం మీకే చెల్లింది.

“గంగాళంలా ఉండే చెరువులు తాంబాళంలా మారినయి…వాటిని తిరిగి గంగాళంగా మార్చుతాం” అన్న నాటి మీ మాట‌ల‌ను గుర్తు చేసుకోవాలి. చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై రెండు నాల్క‌ల మీ ధోర‌ణిని విడ‌నాడాలి. తొమ్మిదిన్నరేళ్లు అధికారం అనుభ‌వించిన మీరు హైద‌రాబాద్ చెరువులు విధ్వంసానికి గుర‌వుతుంటే మౌనం వ‌హించారు. చెరువుల ప‌ట్ట‌ణంగా వ‌ర్దిల్లిన హైద‌రాబాద్ లోని చెరువుల‌ను చెర‌బ‌ట్టిన‌ క‌బ్జాకోరులు వాటిని చెంబులుగా మార్చిన‌ప్పుడు మీరు నిర్లక్ష్యం చూపారు.

మీ హ‌యంలో రాజ‌ధానిలో వందలాది చెరువులు క‌నుమరుగయి..వ‌ర్షా కాలంలో వ‌ర‌ద నీరు పోయే దారి, ఉండే దారి లేక ఏటా ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను బ‌లిగొన్నా మీరు ప‌ట్టించుకోలేదు. చెరువోద్దార‌కులుగా చిత్రించుకునే మీ హ‌యంలో హైద‌రాబాద్ చెరువులు స‌ర్వ‌నాశనం అయ్యాయ‌న్న వాస్త‌వం అంద‌రికి తెలుసు.

మిష‌న్ కాక‌తీయ పేరుతో హ‌డావుడి చేసిన మీరు హైద‌రాబాద్ లో ఒక్క చెరువును కూడా కాపాడ లేదు. వాటి స‌ర్వేను పూర్తి చేయ‌కుండా, వాటి హ‌ద్దులు గుర్తించ‌కుండా కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన మీ తీరును రాజ్యంగ బ‌ద్ద సంస్థ కాగ్ 2020 లోనే త‌ప్పుబ‌ట్టింది. మీ నిర్ల‌క్ష‌పు అన‌వాల్ల‌ను నివేదిక రూపంలో ప్ర‌జ‌ల ముందుంచింది.

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌యోజ‌నాల‌కు కొమ్ముకాసి చెరువుల సహజ మరణానికి కారణమయింది మీ ప్ర‌భుత్వ‌మే.

హైద‌రాబాద్ ని కాపాడే చెరువుల‌ను బ‌తికించుకోక‌పోతే..ఉక్క‌పోత, వేడి, వ‌ర‌ద‌లే హైద‌రాబాద్ కు శాపంగా మారే ప్ర‌మాదం ఉంది. ప్ర‌కృతి ఆస్థులు, ప్ర‌భుత్వ ఆస్థులు మిగిలితేనే హైద‌రాబాద్ కు భ‌విష్య‌త్తు. ఆ స‌దుద్దేశంతో మా ప్ర‌భుత్వం హైడ్రాను ప్రారంభిస్తే…ఆదిలోనే మీరు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం హైద‌రాబాద్ ప్ర‌యోజ‌నాలు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు పూర్తిగా విఘాతం క‌లిగించే అంశం.

అందుకే చెరువుల‌ను చెర‌బ‌ట్టిన పెద్ద‌ల‌ను కాపాడే మీ ప్ర‌య‌త్నాల‌ను మానుకుని..హైద‌రాబాద్ లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుంబిగించిన ప్రజా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి. హైడ్రాను స‌మ‌ర్దించాలి. లేక‌పోతే హైదరాబాద్ ప్ర‌జ‌ల చీత్కారాల‌కు గురి కాక‌త‌ప్ప‌దు.