పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన అవసరం

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దొనకొండ, మహానాడు: పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి ప్రజారాజ్యానికి పెద్దపీట వేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. స్వచ్ఛ తా హి సేవా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన దొనకొండ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తతతో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మన జాగ్రత్త మన ఆరోగ్యమన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులు పలుసార్లు శుభ్రం చేసుకోవడం, మురికి నీరు ఉన్న ప్రాంతాలలో దూరంగా ఉండడం, దోమల కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇలా పరిసరాల పరిశుభ్రత ద్వారా మన ఆరోగ్యాన్ని మంచి సమాజాన్ని నిర్మించవచ్చన్నారు.

విద్యార్థులు చైతన్యంతో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని తల్లిదండ్రుల్లో కూడా చైతన్యాన్ని కలిగించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల పరిశుభ్రతపై అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె వివరించారు. పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత తోనే మంచి సమాజాన్ని నిర్మించవచ్చునని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.