ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాదులను ఉపేక్షించేది లేదు

– గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలోని బ్రాడిపేట 6/20లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గళ్ళ మాధవి హెచ్చరించారు. మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయిలు మదమెక్కి ధ్వంసం చేశారు. సోమవారం ఓ పార్టీకి చెందిన వ్యక్తులు వినాయక విగ్రహం ఊరేగింపు చేశారు. ఇది వారు చేశారా లేక ఆకతాయి చేశారా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దీనికి బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఎన్టీఆర్ అంటేనే తెలుగుజాతి ఆత్మగౌరానికి ప్రతీక అని, అటువంటి ఎన్టీఆర్ విగ్రహం పైన దాడి జరిగింది అంటే ప్రతి తెలుగు వాడి మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. స్థానికంగా ఉన్న ప్రజలు, సీసీ కెమెరాలు ద్వారా ఘటనకు కారణమైన వారి కోసం స్థానిక సీఐ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. సాయంత్రం లోపు నిందితులను గుర్తిస్తామని సీఐ హామీ ఇచ్చారన్నారు. ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని తట్టుకోలేక, ప్రజలకు ముఖం చూపించలేక ఇలా ఘటనలకు పాల్పడడం పిరికిపంద చర్య అని, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తున్న కూడా ఈ సైకోలు చెలరేగిపోతున్నారంటే వారికి ఎంత అహంకారం, బరితెగింపు ఉన్నదో ప్రజలు ఆలోచించాలి. ఎమ్మెల్యే వెంట స్థానిక డివిజన్ అధ్యక్షుడు పోపురీ నరేంద్ర, వజ్జా సూర్యం, ఉప్పుటూరి పేరయ్య, రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కసుకుర్తి హనుమంత రావు, తాళ్ళ వెంకటేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.