Mahanaadu-Logo-PNG-Large

ఉభయ సభల్లో ఫలవంతమైన చర్చలు జరగాలి

– స్పీకర్ అయ్యన్న పాత్రుడు

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్ట సభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర శాసన సభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అంటూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితంగా నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 78వ దినోత్సవ శుభవేల ప్రతి పౌరుడు దేశం పట్ల బాధ్యతా యుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఉప కార్యదర్శులు పీవీ సుబ్బారెడ్డి, రాజ్ కుమార్, పలువురు అసెంబ్లీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.