రోడ్ల మధ్యలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉండకూడదు

-వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు 
-అన్న క్యాంటీన్లు త్వరగా పూర్తి చేయాలి
-మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు దిశానిర్దేశం 
-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ 

అమరావతి, మహానాడు:  రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై, సెంట్రల్ డివైడర్లలో ఉన్న అన్ని రకాల ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు సూచించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి నారాయణ పరిచయ సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కమిషనర్లతో పాటు స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ హరినారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సమస్యలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై మంత్రి సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్ల పై సెంట్రల్ డివైడర్లలో ఎక్కడా ఎలాంటి ఫ్లెక్సీలు ఉండవన్నారు. రాష్ట్రంలో కూడా అదే విధానం కొనసాగించాలని అధికారులకు సూచించారు. సెంట్రల్ డివైడర్లలో ఉండే ఫ్లెక్సీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను కార్పొరేషన్లలో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మురుగు నీటిని శుద్ధి చేసి బయటకు పంపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కార్పొరేషన్లలో పార్కులు, సెంట్రల్ డివైడర్లు, రోడ్లపై పాట్ హోల్స్, సిల్ట్ తొలగించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అమృత్ -1, అమృత్ -2 నిధులను వినియోగించుకోవాలన్నారు. తక్కువ నిధులతో ఎక్కువ ప్రయోజనాలు కనపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 న కనీసం వంద అన్న క్యాంటీన్ల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పనులను ప్రతి రోజూ సమీక్షించాలని పురపాలక శాఖ కమిషనర్ హరి నారాయణన్ కు సూచించారు. ప్రతి రోజూ తాగునీటి శుద్ధత పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు.

వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టేరిలైజేషన్) చేయించాలన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై పూర్తి దృష్టి పెట్టాలన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. 2014-2019 మధ్య తాను మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీలకు మంచి పేరు వచ్చిందన్నారు.  ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. తిరిగి మున్సిపల్ కార్పొరేషన్లకు మంచి పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలు సూచనలు చేశారు. త్వరితగతిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్లాలని సూచించారు.

ఈ సమావేశంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్, ,కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన, రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. ఎం.ధ్యాన చంద్ర, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, కడప కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ తో పాటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ హాజరయ్యారు.