తెదేపా కేంద్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబురాలు

ఐదేళ్లకు ఒకసారి వచ్చే మరపు రాని దీపావళి పండుగ
రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చింది
జగన్ రెడ్డి అరాచక, అవినీతి, విధ్వంసక, నియంత పాలన మాకొద్దని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు
ప్రజాభీష్ట ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది
సీఎంగా బాధ్యతలు చెపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం మొదట ఐదు ఫైల్స్‌పై చంద్రబాబు గారు సంతకం చేశారు
ఇచ్చిన ప్రతీ వాగ్ధానానికి కట్టుబడి ఉంటాం.. ప్రతీ హామీని నెరవేరుస్తాం
ప్రజా సంక్షేమం, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి నేడు సీఎం చంద్రబాబు గారు శంఖారావం పూరించారు

– టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్

ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించడంతో పాటు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4 వేలకు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైల్స్‌పై నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన శుభసందర్భాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, టిడి జనార్ధన్ పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర ప్రజలందరికీ మరపురాని దీపావళి పండుగ: వర్ల రామయ్య

“నేడు నరకాసుర వధ జరిగింది. ప్రజాపాలన మొదలైంది. ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారు ఆ ఐదు ఫైల్స్ పైనే మొదట సంతకాలు పెట్టారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేశారు. అవ్వాతాతలకు ఇచ్చే రూ.3 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతున్నట్లు మూడవ సంతకం పెట్టారు.

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు గారు. ప్రజలు, పెద్దలు, అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఎన్నికల ప్రచారాల్లో ఇచ్చిన వాగ్ధానాలపై సంతకాలు చేశారు. రాష్ట్రమంతటా బాణాసంచా పేలుస్తూ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తబరిచారు.

నేడు రాష్ట్ర ప్రజలందరికీ మరపురాని దీపావళి పండుగ. ప్రతీ సంవత్సరం వచ్చే దీపావళి కంటే ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైనది. రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ దీపావళి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ దీపావళి పండుగలు మరెన్నో జరుపుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను.

రాష్ట్రవ్యాప్తంగా ఈ విజయోత్సవాల్లో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్దేషకులు. విర్రవీగి ప్రవర్తిస్తే ఒక్క క్షణం కూడా ప్రజలు భరించరు. దీనికి ఉదాహరణ ప్రత్యక్షంగా నేడు మన రాష్ట్రంలో కనపడుతోంది. జగన్ రెడ్డి అరాచక, దుర్మార్గపు, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకొద్దని ప్రజలే నిర్దేశించారు. అందుకే ప్రజాప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అందుకు అనుగుణంగానే ప్రజాభీష్ట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది” అని తెలిపారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే చంద్రన్న ధ్యేయం: టిడి జనార్ధన్

“రాష్ట్ర ప్రజలందరూ అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చీకటి రాజ్యంలో జీవించారు. వాక్ స్వేచ్ఛ, ఫోన్ మాట్లాడే స్వతంత్ర్యం, ఏ క్షణాన ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న భయం, కనీసం నచ్చిన పోస్టును వేరొకరికి ఫార్వోర్డ్ చేసుకునే స్వాతంత్ర్యం కూడా మన రాష్ట్రంలో ఉండేది కాదు. కానీ నేడు టన్ను భారం తల మీద నుండి దిగినంత సంతోషంగా రాష్ట్ర ప్రజలున్నారు. స్వేచ్ఛగా, సుఖంగా, సంతోషంగా రాష్ట్రంలో ప్రజలు పండగా చేసుకుంటున్నారు.

నియంతలను, అహంకారమున్న వారిని ప్రజలు సహించరనేదానికి మొన్నటి తీర్పే ఉదాహరణ. చరిత్రలో కూడా అహంకారంతో రాజ్యమేలిన వారు కూడా బ్రతికి బట్ట కట్టలేదు. ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టే ప్రజలు 2019లో ఆఖరి ఛాన్స్ ఇచ్చారు. రాజకీయాలకు వీరు పనికి రారు అనేటటువంటి తీర్పును నేడు ప్రజలిచ్చారు. భారతదేశ రాజకీయాల్లో ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక ప్రజభుత్వాన్ని ధిక్కరించి మరొక ప్రభుత్వాన్ని తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఇదే మొదటిసారి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వయస్సుకు అతీతంగా అందరూ ఏకమై ఇచ్చిన తీర్పు ఇది.

ప్రజల బాధను అర్ధం చేసుకొని వారి మేలు కొరకు ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు కొన్ని హామీలనిచ్చారు. అందుకే నిన్న ప్రమాణస్వీకారం చేసి, నేడు సీఎంగా బాధ్యతలు స్వీకరించి, ఐదు ఫైల్స్‌పై సంతకం చేశారు. పరిశ్రమలు పోయాయి, ఉద్యోగాలు లేకుండా యువతను జగన్ రెడ్డి మోసం చేశారు. అందు కోసమే డీఎస్సీపై చంద్రబాబు మొట్టమొదటి సంతకం చేశారు.

ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడంతో పాటు చివరకు సెక్రటేరియట్‌ను కూడా తాకట్టు పెట్టడం భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అన్ని అయిపోయి చివరకు ప్రజల ఆస్తులపై పడి ఒక తప్పుడు చట్టాన్ని తీసుకువచ్చారు. అటువంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకాన్ని చంద్రబాబు చేశారు. పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ గారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుది. కానీ జగన్ రెడ్డి మాయమాటలు చెప్పి వెయ్యి రూపాయిలు పెంచడానికి ఐదేళ్లు చేశారు.

చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క కలం పోటుతో రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచారు. పేదలు, కూలోలు పొట్ట నింపుకునే అన్నా క్యాంటీన్లను దుర్మార్గపు ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు నాలుగో సంతకం చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు గారు శంఖారావం పూరించారు. ఈ శుభసందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ నేడు, రేపు, ఎల్లుండు కార్యక్రమాలు చేయబోతున్నారు” అని తెలిపారు.