పల్నాడు జిల్లాలో వారికే టిక్కెట్లు
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
బొల్లాపల్లి, నూజండ్ల నుంచి టీడీపీలోకి చేరికలు
పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే రౌడీలు, కబ్జాకోరులు తప్ప అధికార వైకాపాలో ఎవరూ మిగిలేలా లేరని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. గురువారం బొల్లాపల్లి మండలం గండిగనుముల పైతండా నుంచి 20 కుటుంబాలు, నూజండ్ల మండలం ములకలూరు నుంచి 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆంజనేయులు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పల్నాడు జిల్లాను రౌడీ రాజకీ యాలకు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు.
పల్నాడు జిల్లా మొత్తం వైకాపా రౌడీలు, మైనింగ్ దొంగలు, కబ్జాకోరుల్ని ఏరికోరి టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు. కొద్దిరోజులుగా విపక్షాల కార్యాలయాలు తగలబెట్టడం, ప్రచార రథాలు, కార్యకర్తలపై దాడులు ఈ ముఠాల పనేనని స్పష్టం చేశారు. వీరు రాజకీయాలకు అనర్హులని విమర్శించారు. అందుకే పల్నాడు ప్రాంతాన్ని కరవు పరిస్థితులు దాటించి సస్యశ్యామలం చేసేందుకు టీడీపీని గెలిపించాలని కోరారు.