విజ్ఞతతో ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలి

వ్యక్తి కేంద్రంగా పార్టీలు, ప్రభుత్వాలు ప్రమాదకరం
ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం
ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తున్నారు
అభివృద్ధి కోసం మంచివారిని ఎన్నుకోవాలి
ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి

గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలలో ఓటర్లు రాష్ట్ర అభివృద్ధిని, సమాజ సమష్టి ప్రయోజనాలను ఆలో చించి విజ్ఞతతో ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు, యూనివ ర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విశ్రాంత ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ సూరి పిలుపునిచ్చారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తీరుతెన్నులు అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన ఉపన్యసించారు. 1952లో ఓటింగ్‌ 43 శాతం ఉండగా 2019 నాటికి 80 శాతానికి పెరిగిందన్నారు. ఎన్నికలలో ఓటింగ్‌ శాతం పెరుగుతున్నా, ప్రజలలో రాజకీయ పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నా రాజకీయ అవినీతి, నిరంకుశ నాయకత్వం, సహజ వనరుల దోపిడీ పెరుగుతుందన్నారు. నేడున్న రాజకీయ పార్టీలలో సుస్థిరతను, అభివృద్ధిని, ప్రజాస్వామ్య సంవిధానంను అందించగలిగే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు.

రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించకపోతే ప్రజా స్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడే పరిస్థితి ఉత్పన్నమై వ్యక్తి కేంద్రంగా పార్టీలు, ప్రభుత్వాలు కొనసా గుతాయన్నారు. నేడు రాజకీయాలలో ధనవంతులు, వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషిస్తూ ఓటర్లను డబ్బులు, మద్యంతో ప్రలోభాలకు గురిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. కులం, మతం, ప్రాంతాల వారీ గా విభజిస్తూ వారి వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాతిక పరమైన భేదాలు క్షీణించి పార్టీల అధినేతల మధ్య కుస్తీ పోటీగా రాజకీయాలు మారుతుండటం సమాజ వికాసానికి మేలు జరగదన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ ఎన్‌.రంగయ్య ప్రసంగిస్తూ అభ్యర్థుల ఎంపిక పార్టీ సభ్యుల ప్రమేయం లేకుండానే జరుగుతుందన్నారు. కార్పొరేట్‌ శక్తుల మధ్య పోటీగా రాజకీయాలు మారాయ న్నారు. సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగి స్తూ గతంలో అభ్యర్థుల ఎంపిక నైతిక విలువలు, త్యాగాల ప్రాతిపదికగా జరిగితే నేడు గెలుపు గుర్రాల పేరుతో ధన బలం, కుల బలం ఉన్న వారినే ఎంపిక చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి, ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగవడానికి తోడ్పడే అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. వ్యక్తి ప్రయోజనం కన్నా సమాజ ప్రయోజనానికి తోడ్పడే వారిని గెలిపించాలని కోరారు. ఈ చర్చా గోష్ఠిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్‌ రావెల సాంబశివరావు, మద్రాసు విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్‌ జి.కోటేశ్వరప్రసాద్‌, ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ నేత పి.మల్లికార్జునరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, మానవత సంస్థ చైర్మన్‌ పావులూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.