నవంబర్ ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే (సకల పునీతుల దినోత్సవం) 2 వ తేదీ ఆల్ సోల్స్ డే (సకల ఆత్మల దినోత్సవం) విశ్వవ్యాప్తంగా జరిగే రోజు. యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో తమెకేమీ జరుగుతుందో కూడా తెలియని స్థితిలో అర్ధరాత్రి 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఐక్యమైపోయాయి
నౌకా వ్యాపారంలో మచిలీపట్నం ఓడరేవు ఆనాడు ఆఅగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా బ్రిటిష్ పాలకుల కాలంలో విరాజిల్లుతుండేది. బందరు 1864 నవంబర్ 1 వ తేదీ అర్ధరాత్రి విరుచుకుపడిన భయంకర ఉప్పెనలో చిగురుటాకులా బందరు పట్టణం వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు సముద్రతీరంలో భారీ ఇసుకమేటలు వేయడంతో బందరు అభివృద్ధి తిరోగమన దిశలో మొదలైంది. ఈ ఉప్పెన రాకతో నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది.. ఓడలు వచ్చేందుకు తీరం వద్ద సరైన లోతు లేనందున భారీ ఓడల రాకపోకలకు మహా కష్టమైంది..నేటికీ ఆ ఇసుకమేటలు పెట్టని కోటలు మాదిరిగా ఏర్పడి బందరు పోర్టుకి శాపం అయింది. పోర్టు నిర్మాణానికి ఇసకను తవ్వెందుకు నిరంతర డ్రెడ్జింగ్ ఇక్కడ చేయాల్సిందేనని నేటి సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. పరాయి పాలనలో ఒక మెట్రో నగరం మాదిరిగా వెలిగిన బందరు పట్టణ అభివృద్ధి క్రమేపి కుంటుపడింది.
సరిగ్గా 160 సంవత్సరాల కిందటి నాటి బందరు ఉప్పెన చరిత్ర గురించి మనలో చాలా మందికి తెలియదు. రక్తాక్షి నామ సంవత్సరం1864 నవంబర్ 1 వ తేదీన బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి , 780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన తీర ప్రాంతంపై కరాళ నృత్యం చేసింది.. దీంతో ప్రాణ..ఆస్తి తీవ్ర నష్టం కల్గించింది .నాడు బందరు మున్సిపాలిటీ పట్టణంలో 65 వేల మంది జనాభా (రెవిన్యూ రికార్డుల ప్రకారం నాటి విజయవాడ పంచాయతీ మాత్రమే.. అక్కడ జనాభా కేవలం ఎనిమిది వేల మంది మాత్రమే ) ఉండగా అందులో 30 వేల మంది ఒకే ఒక్క రాత్రి దారుణంగా కడలి ప్రకోపం కారణంగా మరణించారు.
భగవంతుడు తనకు విధించిన నియమం ప్రకారం ఎన్నడూ చెలియాలి కట్ట దాటని సముద్రంకు ఆనాడు ఎందుకో ఆగ్రహం కలిగింది. తీరాన్ని దాటి, 17 మైళ్ళు ఊళ్ళపై ఒక్కసారిగా విరుచుకుబడింది. భారీ కెరటాలు జనావాసాలపై చొచ్చుకొచ్చి, పిల్లాపాపలను నిర్జాక్షినిగా ముంచివేసింది. మచిలీపట్నంలోని నేటి కాలేఖాన్ పేట ప్రాంతంలోని శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలో 700 మంది ప్రజలు నాడు నివసించేవారు. ఉప్పెనలో 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలేరని బ్రిటిష్ వారు నమోదు చేసిన రికార్డులలో లిఖితమైంది. ఆనాడు చింతగుంటపాలెంలో నివసించిన పురుషోత్త సోమయాజి శర్మ అనే ఒకాయనను సముద్ర ప్రవాహం ఎక్కడికో తీసుకుపోయి ఆయననుl ఒక తాటిచెట్టుపై మొవ్వలో కూర్చోబెట్టాయి. ఆయన అక్కడ చిక్కుకొని తర్వాత రోజున తాడిచెట్టు దిగివచ్చి అతి కష్టం మీద తన స్వస్థలానికి చేరుకున్నాడని నాడు ప్రజలు కదలక చెప్పుకొనేవారు. అలాగే నాటి బందరులో నేటి కోటావారితుళ్ళా సెంటర్ పాత దుర్గామహల్ (ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు వద్ద) శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ ఉండేది. ఆ పంతులు గారి మేడలో ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు తలదాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారని 13 అడుగుల ఎత్తున సముద్రపు నీళ్లు ఈ మేడ పక్కనుంచి వెళ్లాయని నాటి ప్రత్యక్ష సాక్షులు తమ తరానికి తెలియజేశారు.
ఆ ఉప్పెన అనంతరం నాటి బ్రిటిష్ జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు ఎంతో చిరస్మరణీయం. ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు తమ పొలీసు సిబ్బందితో కలసి కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న అనేక అనాధ శవాల గుట్టలను, పశువుల కళేబరాలను ఎక్కడికక్కడే భూమిలో పూడ్చిపెట్టారు.. ఎడ్మండ్ షార్కి దంపతులు తమ ఉన్నత బాలికల పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు వసతి గృహంలో ఉండి సముద్రంలో మునిగి చనిపోగా.. వారినందరిని ఆ సమీప ప్రాంతంలో ఖననం చేశారు.( ప్రస్తుతం ఇది నోబుల్ కాలనీలో నోబుల్ షార్కి మున్సిపల్ పార్క్ గా కొనసాగుతుంది ) 45 ఏళ్ల క్రితం వరకు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి గుట్టలు కనబడేవి.. మృత కళేబరాలు పాతిపెట్టిన విషయం తెలియని చాలా మంది గుట్టలుగా ఉన్న ఆ మట్టిని తమ ఇళ్ళను మెరకు చేసుకునేందుకు ఎడ్ల బండ్లలలో ట్రాక్టర్లలో తరలించి ఇక్కడ ఒక పెద్ద గుంట గా మార్చారు.. కొందరు ఆ మట్టిని తవ్వే టప్పుడు తమకు మానవ కళేబరం తాలూకా కొన్ని ఎముకలు కూడా దొరికాయని అక్కడి స్థానికులు చెబుతుంటారు
ఆనాటి ఘోర దుర్ఘటనలో పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకోని కుళ్లిపోయిన అనేక శవాలను పీక్కుతినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో మానసికంగా చలించిపోయారు. ఇంతటి ఉప్పెనలో బతికిన కుక్కలు సైతం శవాహారంకు నాడు అలవాటుపడ్డాయట..నేడు మాచవరం సమీపంలో (నేటి డి మార్ట్ పక్కన) 1809 సంవత్సరం నుంచే ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన తాలూకా విలయతాండవంకు ఒక;సజీవ సాక్ష్యంగా నేటికీ నిలిచింది. అక్కడకు వ్యాపించిన సముద్రపు నీరు చర్చి గోడలను తాకుతూ 10 అడుగుల మేర ప్రవహించిందని ఆ చర్చికు చెందిన పాత తరం పెద్దలు తమ వారసులకు చెప్పుకొన్నారు.. ఈ చర్చ్ గోడలకు ఇప్పటికీ ఆ ఉప్పునీటి చారిక స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ ఆ ప్రదేశమతా సున్నం ఎంత పులిమినప్పటికీ ఇప్పటికి ఆ చార స్పష్టంగా కనబడుతూనే ఉంటుందని, సున్నం కలవనీయదని కొందరు స్థానికులు అంటుంటారు.
1864 నవంబర్ 1 వ తేదీన సంభవించిన భయంకర పెనుఉప్పెన అనంతరం ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. బందరు పరిసర ప్రాంతాలపై సముద్రపు నీరు ప్రవహించిన కారణంగా వ్యవసాయ భూములు చౌడుబారి పోయాయి. నూతులలో తీయని నీరు సైతం ఉప్పునీరుగా మారిపోయింది. నాడు ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. వ్యాపారంలో ధనార్జనే ప్రామాణికంగా అంతగా లేని నాటి మానవత్వం కల్గిన కొందరు వ్యాపారవర్గాలు ప్రజల తాగునీటి అవసరాల కోసం 17 వేల రూపాయలు విరాళంగా సేకరించారు. సేకరించిన ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ థారన్ హిల్ కు అందించారు. ఆయన ప్రభుత్వ వాటాగా మరో 30 వేల రూపాయలను సమీకరించి నాటి నాగులేరు ( ఇప్పటి ఖాలేఖాన్ పేట మంచినీటి కాలువ ) నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ తాగునీటి పైప్ లైన్ నిర్మించారు. అప్పట్లో టౌన్ ప్రజానీకo మొత్తం తాగునీటి అవసరాలను తీర్చింది నాటి కోనేరు సెంటర్ ప్రాంతం.. ఎడ్లబండ్లపై ఇక్కడి నుంచి నీటిని పలువురు తరలించుకునేవారు. కోనేరు సెంటర్ కోనేరు అనే పేరు రావడానికి ఇదే కారణం. కొంతమంది అపోహ పడుతుంటారు ఇక్కడ నాటి ఉప్పెన సమయంలో కొందరిని ఇక్కడ ఖననం చేశారని అది పూర్తిగా అవాస్తవం. కోనేరు సెంటర్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కొన్ని పాలరాతి బౌద్ధ విగ్రహాలను ఇక్కడ నెలకొల్పారు. తరువాత వాటిని ఘంటసాల మ్యూజియంకు తరలించారు. వాటిని చూసి కొందరు సమాధులుగా భ్రమించారని చరిత్ర తెలియజేస్తుంది. అంతటి ఘన చరిత్ర గల కోనేరు కూడలి ఇప్పుడు కొందరు మూర్ఖులకు మూత్ర విసర్జన కేంద్రంగా మారింది.
ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా,అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా పైకం కోసం ధన పిశాచాలుగా మారారు. సముద్రం నీటిలో ఊపిరాడక అర్థంతరంగా చనిపోయిన మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో అంతటి బీకర వాతావరణంలోనూ నిమగ్నమైయ్యారంట . వీరు బస్తాల కొద్ది బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి రహస్యంగా తమ ఇంటి గోడల్లో దాచుకున్నరని ఆ తర్వాత వారే మచిలీపట్టణంలో అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో వృద్ధతరం వారు తమ పిల్లలకు కథలు కథలుగా చెప్పుకొన్నారు , అయితే , చనిపోయినవారి శాపం తగిలిన కారణంగానో ఏమో, బంగారం భారీ ఎత్తున సేకరించు కున్న ఆ వ్యాపారం కుటుంబంలో ఒక వింత శాపం మూడు తరాల వరకు వారిని వెంటాడిందంట.. శవాలపై బంగారాన్ని సేకరించిన ఒక వ్యక్తికి అన్నం తింటుంటే కంచంలో తినే ఆహారం పురుగులుగా మాదిరిగా లుకలుకలాడుతూ కనిపించేదని.. దాంతో ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని ఆహరం తప్పని పరిస్థితుల్లో తీసుకొనేవారని చెప్పేవారు.
ఈ ఉప్పెన అనంతరం ఎందరో బందరును విడిచి వేరే ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోయారు. ముఖ్యంగా నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై అంతవరకు ఉన్న భారీ భ్రమలు పూర్తిగా వదులుకొన్నారు. తమ స్థావరాలలో ప్రాణ ఆస్తి నష్టం అధికం కావడంతో తమ మకాన్ని మద్రాస్ కు తరలించారు. ఆ ఉప్పెన అనంతరం కాలక్రమేన బందరు తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం ప్రారంభమైంది..
ఆనాటి విషాదం అత్యధికులకు నేటికీ తెలియదు. బందరు ఉప్పెన పై అవగాహన ఉన్న ఏ ఒక్కరు ఎంతో విషాదకరమైన చరిత్ర గల ఈ రోజున గుర్తు చేసుకోకపోవడం విచారకరం.
పరాయి పాలకుడైన ఒక బ్రిటిష్ అధికారి నాటి ఉప్పెనలో మృతి చెందిన తన కుటుంబ సభ్యులతో పాటు అదే రోజు రాత్రి ప్రాణాలు విడిచిన 30 వేల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థించి బందరుకోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ ( ఖనన స్థలం)లో ఒక భారీ స్థూపం నిర్మించారు. అలాగే నాటి దుర్ఘటనను వర్ణిస్తూ ఒక శిలాఫలకం ఆ స్థూపం లో ఏర్పాటు చేశారు. నేటికీ ఆ నిర్మాణం నాటి ప్రకృతి శాపంను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. తమ ముత్తాతలు అత్యంత దారుణంగా కడలి ఒడిలో కన్నుమూస్తే, ఆ భయంకర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ కనీసం పట్టుమని పదిమందైన ఆ ప్రాంతానికి వెళ్లి 30 వేలమంది ఆత్మలకు ఒక నివాళి ప్రకటించడమో లేక ఒక్క పుష్పగుచ్ఛమైన ఆ సజీవ సాక్ష్యమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం అనేది చేయరు ఇది ఎంత బాధాకర విషయమో కదూ..
– ఎన్. జాన్సన్ జాకబ్ ,
మచిలీపట్నం.