ఎందరో త్యాగధనుల ఫలితం ఈ స్వతంత్రం

టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: ఎందరో త్యాగధనుల ఫలితం ఈ స్వతంత్రమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

దర్శిలో గురువారం స్థానిక రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాల్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. 78వ స్వతంత్ర దినోత్సవాలు ప్రజా కూటమి ప్రభుత్వంలో చేపట్టడం ఎంతో గర్వకారణమన్నారు. స్వతంత్ర ఫలాలు ప్రతి సామాన్యునికి అందేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. 60 రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అనేక పథకాలను ప్రజలకు దరి చేర్చగలిగిన ప్రభుత్వంగా ప్రజాభిమానం పొందగలిగామన్నారు. అనుభవజ్ఞులు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సారథ్యంలో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా 60 రోజుల పాలన సాగిందన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా విజన్ 20047 – లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి మన కూటమి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం, యువత భవిత కోసం మెగా డీఎస్సీ కి రూపకల్పన, ఇసుక ఉచితం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టందని లక్ష్మి తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఆకలి తీర్చే ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని, త్వరలో దర్శి నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అంతకుముందు దర్శిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.