ఏపీకి 12 లక్షల కోట్లు కావాలి
హోదానే ఏపీకి సంజీవని
15 వేల కోట్లకు పండుగ చేసుకోవాలా ?
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి
అమరావతి, మహానాడు : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఏది పడితే అది చెప్పొచ్చు, ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి, కాలపరిమితి ఉండాలి. ఇది పూర్తిగా మేనిఫెస్టో అని ఆమె విమర్శించారు.
ఈ సందర్బంగా షర్మిల రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు లక్ష కోట్లు కావాలని అడిగారు. ఏపీ కి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు కేవలం 1 లక్ష కోట్లు మాత్రమే అడిగారు. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయి. బడ్జెట్లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు.. ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారు ? పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదు. 12 వేల కోట్లు రీహాబిలిటేషన్ కి కావాలి. ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారో ఎందుకు చెప్పలేదు?
హామీలు ఇస్తే సరిపోతుందా
ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారు? 500 కోట్లు ఇస్తారా ? 5 వేల కోట్లు ఇస్తారా? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారు ఎప్పుడు ? ఎంత అనేది క్లారిటీ లేదు. కనీసం బాబుకి అయినా క్లారిటీ ఉందా ? ఇది పూర్తిగా బిజెపి మ్యానిఫెస్టోఅసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది.
ప్రత్యేక హోదా ఊసే లేదు
ప్రత్యేక హోదా అంశం ఊసే లేదు. విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు. విభజనలో మొదటి అంశం హోదా. అసలు విషయం పక్కన పెట్టి, ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారు. మోడీ తిరుపతి లో 10 ఏళ్లు హోదా అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటే మాట తప్పినట్లా? పార్లమెంట్ వేదికగా ఇక హోదా లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు కానీ. హోదా మీద చెప్పడం లేదు. ఇచ్చిన హామీలు కూడా క్లారిటీ లేదు. బీహార్ కి హోదా అని పార్లమెంట్ లో హామీ ఇవ్వలేదన్నారు. కానీ ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు హోదా ఇస్తామని చెప్పింది. హోదానే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి. హోదా వస్తే ఇండస్ట్రీలు వస్తాయి. కేంద్ర సంస్థల స్థాపన కూడా ప్రస్తావన లేదు.
15 వేల కోట్లకు పండుగ చేసుకోవాలా ?
బీహార్ 12 మంది ఎంపీలు ఇస్తే 26 వేల కోట్లు ఇచ్చారు. ఇక్కడ 25 మంది ఎంపీలను తీసుకొని ముష్టి వేస్తున్నారా ? చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీజేపీ మళ్ళీ మోసం చేస్తుందని గమనించాలి. ఒక్కో ఎంపీకి 1 వెయ్యి కోట్ల చొప్పున 15 వేల కోట్లు ఇచ్చి కొనుక్కున్నట్లు ఇచ్చారా? – విశాఖ రైల్వే జొన్ ఊసే లేదు. విశాఖ,విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కావాలి. 2022 కల్లా దేశం మొత్తం పక్కా ఇండ్లు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇండ్లు అంటున్నారు . గత 10 ఏళ్లుగా ఆంధ్రను మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చారు. మోడీ మళ్ళీ మోసం చేశారు అని బాబు గుర్తించలేకపోతున్నారు. ఈ బడ్జెట్ హర్శించేది కాదు. బాబు గారు ఇకనైనా కళ్ళు తెరవండి, బీజేపీతో మద్దతు ఉపసంహరించుకోండి అని పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం ఒక్క రోజైనా ధర్నా చేశారా?
వినుకొండ హత్యపై నేను విచారణ చేశా అని చెప్పలేదు. న్యూట్రల్ మీడియాను అడిగా అని చెప్పా. వాళ్ళు చెప్పిన సమాధానమే నేను మీడియా కి చెప్పాను. ద్దరు గతంలో వైసీపీ లో ఉన్నారు. అప్పుడే విబేధాలు ఉన్నాయి. అప్పుడే కేసులు పెట్టుకున్నారు. ఇండ్ల మీదకు గొడవలకు వెళ్ళారు. వైసీపీ నేతలు పంచాయతీ కూడా చేశారు. అందుకే మేము ఇద్దరి మధ్య పొలిటికల్ కాదు అన్నాను. ఇది పొలిటికల్ మర్డర్ కాదు అని చెప్పాను. పొలిటికల్ మర్డర్ కానప్పుడు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా ధర్నా చేశారా? అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఇది జాతీయ సమస్య అయినట్లు ఢిల్లీ వరకు ధర్నా ఎందుకు చేస్తున్నారు? కడప స్టీల్ మీద ఒక్క రోజైనా ధర్నా చేశారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ జరుగుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ జరుగుతుంది. మీరు తెచ్చిన చట్టం మీద ఎందుకు చర్చ చేయడం లేదు? మీకు మెదడు లేదని అర్థమైందని షర్మిల ఎద్దేవా చేశారు.