తెలుగుగంగ రిజర్వాయర్ లో పెనుప్రమాదం

-ముగ్గురు యువకుల గల్లంతు
-గాలింపులో గజ ఈత బృందం

కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంల ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్ద విహారయాత్ర విషాద యాత్రగా మారింది. సంతోషంతో గంతులు వేసే ముగ్గురు కుర్రోళ్లు ఆ రిజర్వాయర్ లో గల్లంతయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన ఈ ముగ్గురు యువకుల కోసం గల్లంతు గాలింపు కొనసాగుతోంది. ప్రొద్దుటూరు పవర్ హౌస్ రోడ్డుకు చెందిన ఎస్.కె ముధాపీర్ (22), మౌలానా ఆజాద్ వీధికి చెందిన పఠాన్ రహ్మతుల్లా (23), సుందరాచార్ల వీధికి చెందిన వేంపల్లె షాహిద్ (23) గల్లంతు కాగా, మూడు కుటుంబాలను ఈ ఘటన కుదిపేసింది.

ఆదివారం సెలవు దినం కావడంతో ఈ ముగ్గురు యువకులు మధ్యాహ్నం ఈత కోసం వెళ్లినట్లు సమాచారం. వీరు రాత్రి ఇంటికి చేరలేదు, ఇతర స్నేహితుల నుంచి తల్లితండ్రులు ఆరా తీశారు. ఈ సమాచారంతో చల్లబసాయపల్లె సమీపంలో ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం మైన సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్దకు చేరుకుని, దువ్వూరు పోలీసులను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. సోమవారం ఉదయం చల్లబసాయపల్లె రిజర్వాయర్ వద్దకు వెళ్లిన పోలీసులు.. రిజర్వాయర్ గట్టున సెల్ ఫోన్లు, దుస్తుల ఆధారంగా యువకులు నీళ్ళలో గల్లంతు అయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈత బృందాలను నీటిలో దింపి గాలింపు చేపట్టారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ వద్దకు యువకుల స్నేహితులు, బంధువులు చేరుకున్నారు. నదిలో దిగేముందు చివరి సారిగా సెల్ఫీ తీసుకున్న యువకుల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.