ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది

-మిమ్మల్ని ఎన్నుకున్నది పిత్త పరిగెలు పట్టడానికి కాదు… తిమింగలాలను పట్టుకోటానికి
(యలమంచిలి లక్ష్మి)

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గనులు, ఎక్సైజ్, విద్యా, మున్సిపల్, విద్యుత్, నీటి పారుదల, పౌర సరఫరాలు, దేవాదాయ మొదలైన శాఖల్లో విపరీతమైన అవినీతి జరిగింది, సాక్ష్యాలు కూడా దొరికాయి ఇక అవినీతి అధికారులు, మంత్రులు జైలుకు వెళ్ళటమే తరువాయి అని మంత్రులు చెప్పారు, మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది.

గత ఆరు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిని, ఆయన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ ను ఆయన కుటుంబాన్ని విపరీతంగా దూషించిన వారికి, తెదేపా నాయకులు, కార్యకర్తలను హతమార్చిన వారికి, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన వారికి, కార్యకర్తలపై, పార్టీ ఆఫీసులపై దాడులు చేసిన వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని భావించారు.

రెడ్ బుక్ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చిన లోకేష్ కానీ, తాము అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదిలి పెట్టం, అవినీతి, అక్రమాలకు సాక్ష్యాధారాలు ఉన్నాయి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాధ్యతల్లో పడి ఆ విషయం మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు.

గత ప్రభుత్వంలో అవినీతి పరులు, అరాచక వాదులకు వ్యతిరేకంగా ఆంధ్ర ఓటర్లు అతి విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు చేసిన హడావిడి ఇప్పుడు ఏమాత్రం కనిపించటం లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి రాకముందు సిబిఎన్, లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్ పైనా, ప్రభుత్వంలో మంత్రులు, అధికారులపైనా చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలుగానే పరిగణించాలా అన్నది కార్యకర్తల్లో ఇప్పుడిప్పుడే మొగ్గుతొడుగుతున్న సందేహం. దీనిని కొనసాగించడం నాయకత్వానికి, పార్టీ భవిష్యత్తుకు మంచిదికాదు. గత ప్రభుత్వ పాలనలో లోపాలు, అవినీతి, అరాచకం, భూ కుంభకోణాలు లేవని భావించక తప్పని పరిస్థితి కార్యకర్తల్లో నెలకొంది. దీనిని గమనించాల్సిన బాధ్యత నాయకత్వానిదే.

గత ప్రభుత్వంలో అరాచకాలు, చేసిన పెద్దిరెడ్డి, అంబటి, రోజా, బొత్స, సజ్జల, పెర్ని నాని, కోడాలి నాని, వంశీ, ద్వారంపూడి తదితర అక్రమార్కులు దర్జాగా, రొమ్ము విరుచుకుని తిరుగుతుంటే.. శ్రీ రెడ్డి, నాగార్జున రెడ్డి లాంటి చిన్నస్థాయి వారిపై చర్యలు తీసుకుని సరిపెట్టే ప్రయత్నాలు కార్యకర్తలను మెప్పించవు.

ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది పిత్త పరిగెలు పట్టడానికి కాదు, తిమింగలాలను పట్టుకోటానికి అని గమనించండి. నాటి అక్రమార్కులపై కొరడా ఝళిపించేందుకు జరుగుతున్న ఆలస్యం, మీ చిత్తశుద్ధిపై క్యాడర్‌కు అనుమానపు మేఘాలు రావడం సహజం. అలాంటి పరిస్థితి మీకెందుకు? ఆ అపవాదు-అనుమానాలు-విమర్శలు మీకెందుకు?

అవినీతి పరులు, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే ప్రతీకార చర్య అవుతుందని, అభివృద్ధి ఆగిపోతుందని వితండ వాదం చేస్తే..దానిని స్వాగతించేందుకు క్యాడర్-ఓట్లేసిన ప్రజలు సిద్ధంగా లేరని గ్రహించాలి. అవినీతి పరులు, అరాచక వాదులకు శిక్షపడాలనే ప్రజలు మీకు ఓటు వేసింది అనే విషయం గుర్తుంచుకోండి. ఇప్పటికైనా వాళ్ళను చట్ట పరంగా శిక్షించండి..

ఇట్లు
– మీ మీద ఎన్నో ఆశలతో ఓటు వేసిన ఆంధ్ర ఓటరు