కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు

-అల్లర్లు జరగకుండా పూర్తిస్థాయిలో చర్యలు
-మరికొందరిపై బైండోవర్‌ కేసులు నమోదు
-జూన్‌ 5 వరకు పల్నాడులో 144 సెక్షన్‌
-పల్నాడు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ

పల్నాడు జిల్లా నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీ సోమవారం విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్‌ కమిషన్‌ పల్నాడు జిల్లా కలెక్టర్‌గా తనను నియమించిందన్నారు. పల్నాడులో జరిగిన సంఘటనలు దేశంలోనే చర్చనీయాంశమయ్యాయని, ఈ నేపథ్యంలో జూన్‌ 4న కౌంటింగ్‌ సజావుగా జరిగేందుకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. కౌంటింగ్‌ తరువాత ఎటువంటి అల్లర్లు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో సజావుగా ఎలక్షన్‌ జరిగినా కొన్ని ప్రాంతాలలో అల్లర్లు జరగడం వల్ల జిల్లాకు చెడ్డ పేరు వచ్చిందని, ఇందులో మన అందరి పాత్ర ఉందన్నారు. కౌంటింగ్‌ సజావుగా జరిగేందుకు మరికొందరి పై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో పోలింగ్‌ రోజు 14.85 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. పల్నాడు జిల్లాలో జూన్‌ 5 వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు.