Mahanaadu-Logo-PNG-Large

పల్నాడులో కౌంటింగ్‌కు వేళాయె…

పోలీసు యంత్రాంగం అప్రమత్తం
ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు
144 సెక్షన్‌ అమలు చేస్తూ ముమ్మర నిఘా
చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం
గురజాల నుంచి తుది ఫలితాలు

పల్నాడు జిల్లా: పోలింగ్‌ రోజున అల్లర్లతో దేశవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టు కున్న పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన రాజకీయపక్షాల కార్యాలయాలు, అభ్యర్థుల ఇళ్ల వద్ద శనివారం నుంచే బలగాలను మోహరించింది.

జిల్లా అంతటా 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ నిఘాను ముమ్మరం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల, గురజా ల, నరసరావుపేట సహా వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎస్పీ మల్లికాగార్గ్‌ ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ సహా 144 సెక్షన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అల్లర్లు, దాడు లకు పాల్పడ్డవద్దని హెచ్చరించారు. 5వ తేదీ ఉదయం వరకు దుకాణాలు మూసివే యాలని ఆదేశాలు జారీ చేశారు.

చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూలో కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 700 మంది సిబ్బంది కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనున్నారు. జిల్లాలో చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికా రులు చెబుతున్నారు. అదే విధంగా గురజాల నియోజకవర్గం నుంచి తుది ఫలితం వెల్లడి కానుంది. కౌంటింగ్‌ రోజు దాడులు, అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీ సులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.