తీన్మార్.. జోర్‌దార్

-టీడీపీ-బీజేపీ-జనసేన ‘మూడొ’చ్చింది!
– ముగిసిన పొత్తు చర్చలు
-అమిత్‌షా-నద్దాతో ఫలించిన బాబు చర్చలు
– బీజేపీకి 5 అసెంబ్లీ-6 అసెంబ్లీ సీట్లు
– జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు
– పొత్తు వివరాలను పార్టీ నేతలకు వివరించిన బాబు
– రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ పొత్తు పెట్టుకున్నామన్న బాబు
– రెండుసార్లు అమిత్‌షా-నద్దాతో భేటీ అయిన బాబు
– ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొడిచిన పొత్తు
– నేటి ఎన్డీఏ భేటీలో అధికార ప్రకటన
– పదేళ్ల తర్వాత మళ్లీ కలవనున్న త్రిశక్తిదళాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఢిల్లీ వేదకగా ఏపీ రాజకీయాల్లో తీన్మార్ మోగింది.. ఫలితంగా మూడు పార్టీల్లో జోర్‌దార్. అనుకున్నదే జరిగింది. ఊహించిందే జరిగింది. టీడీపీ-బీజేపీ-జనసేన కలుస్తాయని మొదటినుంచీ చెబుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం నిజమయింది. బీజేపీలో నెంబర్ టూ అయిన హోంమంత్రి అమిత్‌షా-పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పొత్తు చర్చలు ఫలించాయి. పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ వ్యూహబృందం చివరి వరకూ చేసిన తెరచాటు ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. పైగా కూటమిపై జరిపిన కోవర్ట్ ఆపరేషన్ బట్టబయలయింది.

ఎట్టకేలకూ టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు ఖరారయింది. బీజేపీకి 5 ఎంపీ-6 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ సీనియర్లకు టెలికాన్ఫరెన్సులో వెల్లడించారు. ఇరుపార్టీలకు మొత్తం 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు దక్కినట్టయింది. కాగా టీడీపీ ఏ పరిస్థితిలో బీజేపీతో పొత్తు పెట్టుకోవలసి వచ్చిందో, చంద్రబాబు తన పార్టీ సీనియర్లకు వివరించారు.

‘మన పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమయింది. ఆ మేరకు జరిగిన చర్చలు ఫలించాయి. బీజేపీకి 5 ఎంపి-6 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించాం. కాబట్టి టీడీపీతోపాటు బీజేపీ-జనసేన ఇకపై క్షేత్రస్థాయిలో పనిచేయాలి. రాష్ట్రాభివృద్ధి కోసమే మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. దానితో మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. అందుకు కేంద్ర సహకారం అవసరం. జగన్ అరాచకపాలనను అంతం చేయాలన్నా, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కావాలన్నా, అన్నింటికన్నా ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్ధిక శక్తి కావాలన్నా కేంద్రంలోని బీజేపీ అవసరం. ఇది నేను నాకోసం పెట్టుకున్న పొత్తు కాదు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్న పొత్తుగా మీరు అర్ధం చేసుకోవాలి. ఇకపై మూడు పార్టీలూ కలసి పనిచేయాలి. టికెట్లు రాని వారు విశాల దృక్పథంతో ఆలోచించండి. అధికారం వచ్చిన తర్వాత మీకు తగిన న్యాయం చేస్తాం. ఎవరూ నిరాశపడవద్దు. మళ్లీ మీతో మాట్లాడతా’’ని టెలీకాన్ఫరెన్సులో తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

——————–

పొత్తు వెనుక ‘ఆ నలుగురు’

టీడీపీ-బీజేపీ పొత్తు కుదురుతుందా? లేదా అన్న సందిగ్ధం నుంచి పొత్తు ఖరారు వరకూ జరిగిన ప్రకియలో నలుగురు కీలకనేతలు ప్రధాన పాత్ర పోషించారు. జనసేన దళపతి పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు కృషి ఫలితమే తాజా పొత్తు అన్నది నిర్వివాదం. ప్రధానంగా జనసేన దళపతి పవన్ కల్యాణ్ పలుసార్లు ఢిల్లీ వెళ్లి.. మూడుపార్టీల పొత్తు అవసరాన్ని బీజేపీ నాయకత్వానికి వివరించారు. మూడు పార్టీల పొత్తు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన ఒత్తిళ్లు కూడా పొత్తు ఫలించడానికి ఒక ప్రధాన కారణమన్నది నిర్వివాదం.

రఘురామకృష్ణంరాజు మూడు పార్టీల పొత్తు ఉంటుందని తొలి నుంచీ వాదిస్తుండగా.. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి పొత్తు ఉంటుందని.. తనను కలసిన సన్నిహితులతో మొదటి నుంచీ ఆత్మవిశ్వాసంతో చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే నిజమయింది.

పొత్తు కోసం ఆయన బీజేపీ అధ్యక్షుడు నద్దాతో అనేకసార్లు భేటీ అయి, పలు నివేదికలు సమర్పించారు. రాష్ట్రంలో పొత్తు అవసరాన్ని ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీ, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీకి పలుసార్లు వివరించారు. అమిత్‌షాను కలసిన ప్రతి సందర్భంలోనూ పొత్తు అవసరాన్ని స్పష్టం చేశారు.

ఇక జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పార్టీ అధ్యక్షుడు నద్దా-హోంమంత్రి అమిత్‌షాతో అనేకసార్లు భేటీ, పొత్తు అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రపార్టీకి వివరించి, పొత్తు వైపు నడిపించడంలో సత్యకుమార్ కీలకపాత్ర పోషించారు. అటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తాను అనేకసార్లు చేయించిన సర్వే ఫలితాలను, అమిత్‌షా-నద్దాకు అందించారు. ఆ ఉద్దేశంతోనే ఆయన పొత్తు ఉంటే సానుకూల ఫలితాలు వస్తాయని వివరించారు.

కాగా పొత్తు చర్చల ప్రక్రియ వ్యవహారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఎక్కడా ఎవరితో చర్చించకుండా తొలిసారి గుంభనం పాటించడం ఈసారి విశేషం. సహజంగా చంద్రబాబునాయుడు ఏ అంశంపైనయినా సహచర నేతలో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకుంటారు. అయితే ఢిల్లీ వెళ్లిన తర్వాత బాబు ఎవరితోనూ మాట్లాడకుండా, గుంభనంగా ఉండి.. తుది చర్చల ఫలితాలితర్వాత మాత్రమే పెదవి విప్పడం విశేషం.