తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసేశారు

  • టి.టి.డి. నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెర తీశారు
  • తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపేసింది
  • తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది కూటమి మాత్రమే
  • మూడు పార్టీలూ కలసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి
  • బీజేపీ నాయకులతో భేటీలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్

తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం, వారు ఏరికోరి నియమించుకున్న అధికారులు మంటగలిపేసిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురి చేసిందని… కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా ధర్మ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను సైతం అడ్డగోలుగా వాడుకొనే కుట్రలకు వైసీపీ నాయకులు తెర తీసిన విషయంపై సమగ్ర సమాచారం పార్టీ దగ్గర ఉందన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాల గురించీ, తిరుపతి అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలపై చర్చించారు. పలువురు తెలుగుదేశం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.

దొంగ ఓట్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలి
బీజేపీ నాయకుల సమావేశంలో తిరుపతి నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లు, ఒకే వ్యక్తి పేరుపై మూడునాలుగు ఓట్లు ఉండటంపై ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలు, దౌర్జన్యాలను ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ చేస్తుందని… దాన్ని మూడు పార్టీలూ సమర్ధంగా ఎదుర్కోవడంపై చర్చించారు. ఇప్పటికే వేలకొద్దీ బోగస్ ఓట్లు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయనీ వాటిపై ఎన్నికల కమిషన్ దృష్టికి బీజేపీ, జనసేన పార్టీలు తీసుకువెళ్ళాయని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు , బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్ , సిద్ధార్థ్ నాథ్ సింగ్ , రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో నిర్వహించిన చర్చల్లో బోగస్, దొంగ ఓట్లుపై చర్చ జరిగింది. దీనిపై కచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము. అదే విధంగా బూత్ స్థాయిలో కూడా మూడు పార్టీల నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి దొంగ ఓట్లను అడ్డుకోవడం అత్యవసరం. ఈ విషయం లో మూడు పార్టీలు ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పని చేయాలి. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలకు మేము ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తాము. అదే విధంగా ఎలక్షనీరింగ్ విషయంలో లీగల్ టీమ్స్ ను కూడా సన్నద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. మూడు పార్టీల న్యాయవాదుల బృందాలు కలవాలి” అన్నారు.

ప్రజలకు భరోసా ఇద్దాము
తిరుపతి ప్రజలు వైసీపీ అరాచకాలతో ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో బీజేపీ నాయకులు తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, పకడ్బందీగా జరగాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు. తిరుపతిలో గంజాయి ముఠాలు పేట్రేగిపోతున్నాయి అని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసేసిన వైసీపీని సాగనంపాల్సిన సమయం వచ్చేసింది. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా ఉంది. వైసీపీ అరాచకాలను, అవినీతికి, గూండాయిజానికీ ప్రతి వర్గం నలిగిపోయింది. రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, వృద్ధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ… ఇలా ప్రతి వర్గం వైసీపీ వల్ల బాధలు పడుతోంది.

పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు బెంబేలెత్తిపోయారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే. ఈ ఎన్నికల్లో వైసీపీని బలంగా ఎదుర్కోగలిగేది కూటమి పార్టీలే అని ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. కచ్చితంగా మూడు పార్టీలవాళ్లం కలసికట్టుగా పనిచేద్దాము. ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయిలో నాయకులే కాకుండా నియోజకవర్గాల నాయకులు రివ్యూ మీటింగ్స్ చేసుకోవడం, సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయ”ని తెలిపారు. భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి, బీజేపీ నాయకులు అజయ్ కుమార్, సామంచి శ్రీనివాసులు,  ముని సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, కె.భాస్కర్, పెనుబాల చంద్ర,  జల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

జనసేనలో చేరికలు
తిరుపతి నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త పొలకల మల్లికార్జున్ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతిలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ధర్మవరం పట్టణానికి చెందిన ఎగ్జిబిటర్ భాస్కర్ పార్టీలో చేరారు. రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు ఈ రోజు జనసేనలో చేరారు. చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి కూటమి తరఫున పోటీ చేసున్న తెలుగుదేశం అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు.