-పంద్రాగస్టు నుంచి అన్న క్యాంటీన్
– రూ.5కే భోజనం
-పేద ప్రజలకు కడుపునిండా భోజనం అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతం
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. 2.25 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నామన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు.
శనివారం ఉదయం నందిగామ పట్టణంలోని స్థానిక రైతు బజార్ వద్ద గతంలో నిర్మించిన అన్న క్యాంటీని భవనాన్ని పరిశీలించి దాని నిర్వహణకు కేటాయించిన తొమ్మది లక్షల రూపాయల నిధులకుగాను పనుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణ పార్టీ నేతలతో కలసి కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో ఈ క్యాంటీన్ అన్నింటినీ గోదాములు, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారని విమర్శించారు. గతంలో అక్షయపాత్ర ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించిందని గుర్తు చేశారు.
గతంలో మాదిరిగా అదే 5 రూపాయలకు మంచి భోజనం, టిఫిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. పేద ప్రజలకు కడుపునిండా భోజనం అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ పార్టీ నేతలు పాల్గొన్నారు.