హైదరాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. వివరాలు ఇలా ఉన్నా యి.
మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురానా పూల్, కామా టిపుర, కిషన్ బాగ్, బహదూర్ పురా ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతిస్తారని, ఈ సమయంలో సాధారణ వాహనదారులను బహదూర్ పురా ఎక్స్ రోడ్స్ నుంచి ఈద్గా వైపు అనుమతి ఉండదని సూచించారు. ఈ వాహనాలను బహదూర్ పురా క్రాస్ రోడ్డు వద్ద కిషన్ బాగ్, కామాటి పుర వైపు మళ్లించనున్నట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చే వాహనాలు జూ పార్కు వద్ద, మసీద్ అల్హా ఓ అక్బర్‌కు ఎదురుగా ఉన్న బహిరంగ స్థలంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. శివరాంపల్లి, దానమ్మ హాట్స్ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్ చౌరస్తా నుంచి అనుమతిస్తారని, ఈ సమయంలో సాధారణ వాహనదారులకు ఈద్గా వైపు అనుమతి ఉండదని వివరించారు. ఈ వాహనాలను దానమ్మ ఎక్స్ రోడ్స్ నుంచి శాస్త్రీ పురం, ఎన్‌ఎస్ కుంట వైపు మళ్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాహనాలకు మోడ్రన్ సామిల్ పార్కింగ్ పక్కన, ఇద్గా మైదాన్‌కు ఎదురుగా మెయిన్ రోడ్డుపై, మీరాలం ఫిల్టర్ బెడ్, మీరాలం ఫిల్టర్ బెడ్‌కు పక్కన ఉన్న ఖాళీ స్థలం, దానికి ఎదురుగా ఉన్న సుఫీ కార్స్, యాదవ్ పార్కింగ్ కార్లు వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. కాలాపత్తార్ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలు.. కాలాపత్తార్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లాలని, సాధారణ వాహనాలు పీఎస్ వద్ద నుంచి మోచీ కాలనీ, బహదూర్ పురా, శంషీర్ గంజ్, ఎన్‌కే కుంట వైపు వెళ్లాలని సూచించారు. వాహనాలను బయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద పార్కింగ్ చేయాలని కోరారు.