గిరిజన మహిళ గుడిసె దగ్ధం!

– వైసీపీ నేత ప్రోద్బలం

నూజెండ్ల, మహానాడు: నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ మేకల కోటమ్మ గుడిసె దగ్ధమైంది. బాధితురాలు అందించిన వివరాలివి. కోటమ్మ తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఓటు వేసిందని కక్ష కట్టిన వైసీపీ నాయకుడు నక్క నాగిరెడ్డి ఆమెను హతమార్చేందుకు పథకం వేశారు. ఆ కాలనీలోని వైసీపీ వర్గీయులైన ఇల్లా హనుమంతరావు, రామకోటయ్య, వీరాంజి, రాజయ్య లతో గుడిసెలో నిద్రిస్తున్న కోటమ్మను చంపేందుకు గుడిసె తగుల పెట్టించాడు. గుడిసెకు మంటలు అంటుకున్నట్టు గమనించిన కోటమ్మ, కుటుంబ సభ్యులు తప్పించుకొని ప్రమాదం నుండి బయటపడ్డారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో తాము టీడీపీకి ఓటు వేశామని కక్ష కట్టి నాగిరెడ్డి తనను చంపేందుకు గుడిసె తగలబెట్టించడమే కాక సోమవారం ఉదయం తన వద్దకు నాగిరెడ్డి వచ్చి షార్ట్ సర్క్యూట్తో నీ గుడిసె తగలబడిందని బుకాయిస్తూ బెదిరించాడని బాధితురాలు కోటమ్మ బోరుమంది. తనను హత్య చేసేందుకు ప్రయత్నించి, గుడిసెను తగలబెట్టించిన వైసీసీ నాయకుడు నక్క నాగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతోంది.