కోడెల శివప్రసాదరావుకు ఘన నివాళులు

మంగళగిరి, మహానాడు: పల్నాడు ప్రజల ఆత్మ బంధువైన ప్రజా నాయకుడు కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన సేవలను కొనియాడారు.

మూడున్నర దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో పల్నాడు అభివృద్ధి కోసమే ఆయన ప్రతి నిమిషం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాని పాటుపడటంతో పాటు.. పార్టీకోసం, కార్యకర్తల కోసం అన్ని సందర్భాల్లో అండగా నిలిచిన గొప్పవ్యక్తి అని మెచ్చుకున్నారు. ఆయన సేవలను పల్నాడు నేతలు ఆదర్శంగా తీసుకుని పల్నాడు అభివృద్ధి కోసం, పల్నాడు ప్రజల క్షేమం కోసం పనిచేయాలని ఆకాక్షించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, మాజీ శాసన సభ్యుడు కలమట వెంకటరమణ, పార్టీ నేతలు ఏవీ రమణ, ధారపనేని నరేంద్రబాబు, చప్పిడి రాజశేఖర్, దేవినేని శంకర్ నాయుడు, తదితర నేతలు పాల్గొన్నారు.

వినుకొండలో…
వినుకొండ పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పల్నాటి గడ్డపై తిరుగులేని ప్రజానాయకుడు దివంగత కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు, నాయకులు ఘన నివాళులర్పించారు.

డాక్టర్ కోడెల శివరాం వసతి గృహంలో…
పల్నాడు ప్రాంతానికి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఎప్పటికీ ఆదర్శనీయులని కమ్మ విద్యార్థుల వసతిగృహం నిర్వాహకులు తెలిపారు. సోమవారం నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఐదో వర్ధంతి సందర్భంగా కోడెల తనయుడు, యువనేత డాక్టర్ కోడెల శివరాం వసతి గృహంలో గల ‘పెద్దాయన’ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ‘అన్న’ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసతిగృహ నిర్వాహకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నాయకులకు పూలమాలలు వేసి, జోహార్లు పలుకుతూ ఘనంగా నివాళులు అర్పించారు.