- – ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి, మహానాడు: జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కొందరు టీటీడీని అగౌరపరిచారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసిన వారందరిని దోషులుగా నిలబడే సమయం తొందరలోనే వస్తుంది… ఇది కోట్లాది మనోభావాల భక్తులకు సంబంధించిన అంశం. రాజకీయాలకు తావులేకుండా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా ఇందులో జరిగిన అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంకటేశ్వర స్వామి విషయంలో నిజం తప్ప వేరేది చెప్పరు అని నమ్ముతున్నారు కాబట్టే వెంటనే ప్రజా స్పందన తీవ్రంగా వచ్చింది. దానికి జగన్ మోహన్ రెడ్డి భయపడిపోయి నన్ను ఈ సమాజం ఎక్కడ వెలివేస్తుందేమోనని, హిందుత్వానికి మేమే ఛాంపియన్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చేసిన తప్పు కళ్ల ముందు ఉంది కాబట్టి డిఫెన్స్ మెకానిజంలో నుంచి వెలుగులోకి వచ్చారు. ఆయన డిఫెన్స్ మెకానిజంలో నుంచి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారన్నారు.
వైఎస్సార్సీపీ ఆత్మరక్షణలో పడికొట్టుకుంటోంది…. సొంత బంధువులుగా చెప్పుకునే వారే పక్క పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాజకీయ అంశం కాదు. అదొక పవిత్రమైన ధార్మిక అంశం. టీటీడీ పాలక మండలి అంటారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాదు.. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన అంశాలను ప్రజల ముందు పెట్టారు. దీనిపై చర్చ జరగాలి. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కమర్షియల్ యాక్టివిటీని చేయాలనుకున్నారు.
స్వామి వారిని సామాన్యులకు దూరం చేయాలని 150 రూపాయల రూమ్ రెంట్ ను 2000 రూపాయలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడి విలవిలలాడుతున్నారు. ప్రజల్లో నమ్మకం పెరగకపోవడంతో.. ఉన్న నమ్మకం కూడా కొట్టుకుపోతుందని భయంతోటి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు? ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడారు చెప్పండి ? ఎన్నిసార్లు వెంకటేశ్వరస్వామి గొప్పతనం గురించి మాట్లాడారో చెప్పండి ? ఇవన్నీ ఆత్మరక్షణ కోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తునటువంటి విన్యాసాలు… అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దుమ్మెత్తిపోశారు.