తుస్సుమన్న జగన్‌ వినుకొండ బస్సు యాత్ర

ఊదరగొట్టి ఉసూరుమనిపించారు!
జనం లేక మాట్లాడకుండానే వెళ్లిన అధినేత
నిరుత్సాహానికి గురైన వైసీపీ శ్రేణులు

వినుకొండ, మహానాడు: అడుగో వస్తున్నాడు.. ఇదిగో వచ్చాడు.. అంటూ పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎంపీ అనిల్‌కుమార్‌ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారం రోజులుగా సోమవారం జరిగే సిద్ధం సభకు జన సమీకరణ చేశారు. అనుకున్న ప్రకా రం ఎంతో కొంత ఐదు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్‌కు చేరుకున్నారు. జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడేందుకు వీలుగా లైటింగ్‌, మైకు సెట్లతో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం నుంచి ఎదురుచూసిన వైసీపీ శ్రేణులకు జగన్‌ నోరు మెదపకపోవడంతో నిరుత్సాహం తప్పలేదు. జగన్‌ కేవలం చేతులతో అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.

దాంతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి సిద్ధం బస్సు యాత్రకు వచ్చిన వైసీపీ శ్రేణులు బిక్కమొకాలు వేసుకుని వెనుదిరిగారు. పెద్దఎత్తున దీనిపై వైసీపీ శ్రేణుల్లో నాయకుల్లో చర్చ మొదలైంది. ఆయన మాట్లాడకపోవడానికి గల కారణాలేంటి? కనీసం ఐదు నిమిషాలైనా మాట్లాడవచ్చు కదా? కేవలం రోడ్డు షోకే ఎందుకు పరిమిత మయ్యారు? వినుకొండ నేతలపై అసంతృప్తా.. లేదా ఆరోగ్య సమస్యలా..మరే ఇతర కారణా లు అనేది ఆ పార్టీ వర్గాలు ధ్రువీకరించాల్సిందే. దీనిపై ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ మాత్రం నవ్వుకుంటూ ఆ పార్టీ నవ్వులు పాలైందని జగన్‌ జనంలో ఏం మొహం పెట్టుకొని మాట్లాడతా రని ఎద్దేవా చేస్తున్నారు. జగన్‌ ఏదో మాట్లాడుతాడు దానికి కౌంటర్‌ కూడా సిద్ధం చేసుకుని విలేకరుల సమావేశానికి కూడా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు సిద్ధమయ్యారు. ఆయన ఏమీ మాట్లాడకపోవడంతో జగన్‌ బస్సు సభ తుస్సుమందని మాట్లాడుతూ ఎద్దేవా చేయడం కనిపించింది.