వరద బాధితులకు యూబీఐ ఆపన్న హస్తం

– ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 500 కుటుంబాలకు నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ ముందుకు కదిలింది. సోమవారం సింగ్ నగర్, శాంతినగర్ కాలనీలో వరద ప్రభావిత ప్రజలకు బట్టలు, నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందించింది.

యూబీఐ విజయవాడ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, జోనల్ హెడ్ సీవీఎన్ భాస్కర్ రావు చేతుల మీదుగా 500 కుటుంబాలకు ప్రత్యేక కిట్లను అందించడం జరిగింది.

12 కిలోల బరువు, రూ. 3 వేలు విలువైన ఒక్కో కిట్ లో చీరలు, పంచెలు, బెడ్ షీట్, టవల్, బియ్యం, పప్పు, చక్కెర, ఉల్లిపాయలు, వంటనూనె, పసుపు, చింతపండు, మిర్చి పౌడర్ తదితర వస్తువులు ఉన్నట్లు జోనల్ హెడ్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో తమ బ్యాంకు ముందుంటుందని.. ఆహార పంపిణీ, పాఠశాలల నవీకరణ తదితర సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ హెడ్ ఎ.శారదామూర్తి, రీజనల్ హెడ్ ఎం.శ్రీధర్, డిప్యూటీ రీజనల్ హెడ్స్ హరీష్, ఐ ఎస్ ఎస్ మూర్తి, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.