భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

– 11 రోజులపాటు రాజకీయాలకు పూర్తి దూరం
– పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమైన సంజయ్
– 2011లో ఒక్కడితో మొదలైన బండి సంజయ్ భవానీ దీక్ష
– నేడు సంజయ్ తోపాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరణ
– 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్
– నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న బండి సంజయ్
– పేద, ధనిక తేడా లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ దీక్ష చేపట్టేలా అన్నిరకాల ఏర్పాట్లు చేసిన కేంద్ర మంత్రి
– నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అత్యంత సుందరంగా ఆలయ ఆలంకరణ
– వెలుగు జిలుగులతో అలరారనున్న మహాశక్తి అమ్మవారి ఆలయం
– నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు
– ప్రతిరోజు రాత్రి దాండియా ఉత్సవాలు నిర్వహించనున్న ఆలయ నిర్వాహకులు

కరీంనగర్: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు.
ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. ఈరోజు నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు.

బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం 14వసారి. మహాశక్తి అమ్మవార్ల ఆలయ ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా 2011లో తొలిసారిగా బండి సంజయ్ ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆనాడుతో ఆయనతోపాటు మరో ఐదారుగురు మాత్రమే ఆనాడు దీక్ష చేపట్టారు. అధ్యాత్మకంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ భవానీ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో బండి సంజయ్ ప్రోత్సహిస్తున్నారు.

ఖర్చుతో పనిలేకుండా, భవానీ దీక్ష చేపట్టాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవార్ల ఆలయంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు.

బండి సంజయ్ ప్రోత్సహంవల్ల నేడు కరీంనగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా వేలాది మంది భక్తులు ‘భవానీ దీక్ష’ చేపడుతున్నారు. ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటికీ భవానీ దీక్షను మాత్రం క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నారు.

బండి సంజయ్ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ ఈ 11 రోజులు మాత్రం భవానీ దీక్ష చేస్తున్న భక్తులతో మమేకమై ఆలయంలోనే అమ్మవారిని సేవిస్తూ నిత్య పూజలు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు భవానీ దీక్ష చేపడుతున్న వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. బండి సంజయ్ సైతం వారితో కలిసి భోజనం చేస్తారు.