నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి 

ఈ సందర్భంగా నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి రథసారధి జి.కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యాంశాలు :

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ యువత ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేశారు. సుమారు 1500 మంది తెలంగాణ బిడ్డలు బలిదానమయ్యారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి నిరంతర పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది.

నాడు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టినా, లాఠీలు జులిపించగా, సుష్మాస్వరాజ్ గారు విద్యార్థుల ఆకాంక్షను, గుండెచప్పుడును పార్లమెంటు లో వినిపించారు. తెలంగాణలో పర్యటించి విద్యార్థుల పోరాటంలో బిజెపి అండగా ఉంటుందని చాటిచెప్పారు. తెలంగాణ సాధనలో బిజెపి కీలక పాత్ర పోషించింది.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా నోటిఫికేషన్లు ఇ్వకుండా తెలంగాణ యువతను వెన్నుపోటు పొడిచి మోసం చేసింది. బిజెవైఎం కార్యకర్తలపై, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నాం. ధర్నా చౌక్ లో ఉద్యమాలు చేయొద్దని నిషేధం విధించిన ఘనుడు కేసీఆర్.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు అనేక రకాల హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఉస్మానియా విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపర్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం.

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నరు. ఎక్కడపోయాయి..? జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. నేడు రేవంత్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏవి..? 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పి మాట తప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్లడంలేదు.. దరఖాస్తులు తీసుకోలేదు. సెక్రటేరియట్ లో పైరవీకారులు వెళ్లేందుకు నో ఆస్కర్.. నో టెల్లర్ అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

సెక్రటేరియట్ కు కాంగ్రెస్ నాయకులు, పైరవీకారులకు ఎంట్రీ ఉంది. కాని, నిరుద్యోగ యువకులను వెళ్లనివ్వడం లేదు. అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నవి కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు. బిజెపి రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అబద్ధాలు ఆడటం, మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలే గుదిబండలుగా మారుతాయి. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు పెనంమీది నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారాయి. గులాబీ జెండా పోయి.. చేయిగుర్తు జెండా వచ్చింది. కేసీఆర్ దోపిడీ పోయి.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దోపిడీ వచ్చింది.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీ మంత్రులు, హైకమాండ్ కు మాత్రమే లాభం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అధికార దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి.

నాడు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చకున్నారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.

మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు.. కాని, పాలనలో, తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే. రెండు పార్టీలు ఒకేతాను ముక్కలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న, మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు అండగా బిజెపి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చేలా బిజెపి పోరాటం చేస్తుంది అని అన్నారు.