– ఆళ్ల సాయిదత్ నియామకం
– రాబిన్‌శర్మ టీమ్‌లో పనిచేసిన సాయిదత్
– గతంలో అమిత్‌షా టీమ్‌లోనూ పనిచేసిన అనుభవం
– వైసీసీ నిర్మాణ బాధ్యతలు, ఆఫీసు వ్యవహారాలు ఇకపై ఆయనకే
– సోషల్‌మీడియా దళపతిగా విజయమ్మ బంధువు యశ్వంత్‌రెడ్డి
– జనంలో దూసుకుపోతున్న జగన్ సోషల్‌మీడియా
– లోకేష్ టార్గెట్‌గా కొద్దిరోజుల నుంచి సోషల్‌మీడియా పోస్టింగులు
– విద్యాశాఖ, హాస్టళ్లపైనే దృష్టి సారించిన వైసీపీ సోషల్‌మీడియా కొత్త దళం
– విజయవాడ వరదలు, ఇంజనీరింగ్ కాలేజీ బురద లో పైచేయి
– కూటమిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం
– టీడీపీ సోషల్‌మీడియా సైన్యంలో స్తబ్దత
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికార వియోగ ఫలితంగా నిలువెత్తు నిరాశలో ఉన్న వైకాపేయులలో మళ్లీ సమరోత్సాహం నింపేందుకు వైకాపా అధినేత జగన్ అడుగులువేస్తున్నారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా జనంలో నిత్యం నానుతున్న సోషల్‌మీడియాపై పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఐప్యాక్ సలహాలు పనిచేయకపోవడంతో, ఇప్పుడు కొత్త సలహాదారుడిని జగన్ రంగంలో దింపారు.
అందులో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఆళ్ల మోహన్ సాయి దత్‌ను సలహాదారుగా నియమించారు. దత్ గతంలో టీడీపీ వ్యూహకర్త రాబిన్‌శర్మ టీమ్‌లో పనిచేసిన దత్, అంతకుముందు అమిత్‌షా టీమ్‌లో కూడా పనిచేసినట్లు చెబుతున్నారు. ఇకపై పార్టీ నిర్మాణం, ఆఫీసు వ్యవహారాలు, అధికారపార్టీపై ఎదురుదాడికి సంబంధించిన వ్యూహాల బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక వైసీపీ అధినేత జగన్ తన సోషల్‌మీడియా దళాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే విజయమ్మ సమీప బంధువు, అనంతపురం జిల్లాకు చెందిన యశ్వంత్‌రెడ్డికి సోషల్‌మీడియా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకూ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జల భార్గవ్‌రెడ్డి అదే హోదాలో కొనసాగుతున్నప్పటికీ, క్రియాశీల బాధ్యతలన్నీ యశ్వంత్‌రెడ్డి నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో అధికార మార్పు-తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు ఉన్నందున, వైసీపీ సోషల్‌మీడియా వ్యవహారాలు బెంగుళూరు నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
యశ్వంత్‌రెడ్డికి సోషల్‌మీడియా బాధ్యతలు అప్పగించిన తర్వాత జగన్ సోషల్‌మీడియా జనంలోకి వేగంగా దూసుకుపోతున్నట్లు పార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా కొత్త దళం విద్యాశాఖ మంత్రి లోకేష్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ పరిథిలోకి వచ్చే ప్రైవేటు-ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం. తద్వారా లోకేష్ విఫలమంత్రిగా చూపించడ మే దీని లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికోసం కొంతమంది యువకులను, క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల బాత్‌రూమ్‌లలో.. హిడెన్ కెమెరాలు పెట్టారన్న ప్రచారం, మొన్నటివరకూ హాట్‌టాపిక్‌గా నడిచిన విషయం తెలిసిందే. చివరకు అక్కడ ఎలాంటి రహస్య కెమెరాలు లేవని పోలీసు దర్యాప్తులో తేలింది. అది విద్యార్ధుల మధ్య నడిచిన ముక్కోణ ప్రేమ వ్యవహారమని, దానిని వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు మలిచిన వివాదంగా గుర్తించారు.
కానీ అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది. ఈ వ్యవహారం ఆసాంతం మంత్రి లోకేష్ లక్ష్యంగానే నడిచింది. చివరికి దానిపై లోకేష్ కూడా స్పందించి, కెమెరాలు ఎక్కడున్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలంతా విద్యామంత్రిగా లోకేష్ విఫలమయ్యారని విరుచుకుపడిన తెలిసిందే.
ఇక గత తొమ్మిదిరోజుల నుంచి విజయవాడను వ ర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, అధికారల వరకూ కాళ్లకు బలపాలు కట్టుకుని నీళ్లలోనే తిరుగుతున్నారు. మంత్రి రామానాయుడయితే గండ్లు పూడ్చివేతపనిలో అక్కడే తిష్టవేశారు. డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్న బాబు సర్కారు, అదే డ్రోన్లతో రోడ్లపై బ్లీచింగ్ చల్లుతోంది. ఫైరింజన్ల ద్వారా ప్రతి ఇంట్లోని బురదను క్లీన్ చేస్తున్నారు .
అయితే.. అసలు బాధితులకు ఏమీ చేయడం లేదంటూ టీడీపీ కార్యకర్తల ముసుగులో, వైసీపీ కార్యకర్తలను రంగంలోకి దించి, వారి విమర్శలను సోషల్‌మీడియాలో ప్రచారం కల్పించడంలో వైసీపీ సోషల్‌మీడియా వివిధ ఎత్తుగడలు అనుసరిస్తోంది. మేం కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలమయినప్పటికీ, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని వారితో చెప్పించి, మళ్లీ వాటిని వైసీపీ తన మీడియా-సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారంతో, కూటమిని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే.. వైసీపీ సోషల్‌మీడియా వ్యూహాలు వేగంగా జనంలోకి వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టడంతోపాటు, వారిపై వేగంగా చర్యలు తీసుకోవడంలో పార్టీ- ప్రభుత్వం విఫలమవుతోందన్న అసంతృప్తి, టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి గత ఎన్నికల ముందు, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు చాలా చురుగ్గా పనిచేశారు. వైసీపీపై స్వచ్ఛందంగా పోస్టులు పెట్టేవారు. పరాయి రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం టీడీపీ సోషల్‌మీడియా సైనికులు స్వచ్ఛందంగా పనిచేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వారిలో ఉత్సాహం కనుమరగయింది. గతంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి, జైళ్లకు పంపించిన పోలీసులు, ఎమ్మార్వోలు, ఆర్డీఓలకు మళ్లీ పోస్టింగులిస్తున్న వైనం వారికి రుచించడం లేదు. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా.. చంద్రబాబు-లోకేష్-భువనేశ్వరి-పవన్‌పై నోరుపారేసుకున్న నాటి వైసీపీ ప్రముఖులను, ఇప్పటిదాకా జైల్లో పెట్టలేదన్న ఆగ్రహం-అసంతృప్తి, సోషల్‌మీడియా సైనికుల్లో బలంగా నాటుకుపోయింది.
దానికితోడు టీడీపీ అనుకూల మీడియాలోనే.. జగన్ ప్రోత్సహించిన కంపెనీలనే, తిరిగి కూటమి సర్కారు ప్రోత్సహిస్తోందన్న కథనాలు కూడా టీడీపీ సోషల్‌మీడియా సైనికుల నిర్లిప్తతకు- వైసీపీ సోషల్‌మీడియా సైనికుల సమరోత్సాహానికి కారణంగా కనిపిస్తోందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.