సమస్యల పరిష్కారమే వారధి ప్రధాన లక్ష్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ, మహానాడు: సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రత్యేకంగా పూజలు చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా సమస్యల స్వీకరణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తారని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవారధిలా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర కార్యాలయంలో స్వీకరించిన సమస్యలను క్రోడీకరించి ఏ ప్రభుత్వ విభాగానికి పంపించాలి? సమస్య తీవ్రతను ఆధారంగా పరిష్కారానికి ప్రాధాన్యతల విషయంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక సాఫ్టవేర్ ను వినియోగిస్తున్నామని చెప్పారు. కాగా, సరికొత్త వెబ్ సైట్ ను పురందేశ్వరి ప్రారంభించారు.

వెల్లువెత్తిన వినతులు

వారధి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే పురందేశ్వరి పరిష్కార మార్గాన్ని సూచించారు. దాదాపుగా ప్రధాన సమస్యలు 20 వరకు వచ్చాయి. ప్రకాశం జిల్లా నుండి రూ.500 కోట్లు అవినీతి దగ్గర నుండి కడప జిల్లాలో జరిగిన ఒక హత్యకేసు పోలీసులు నమోదు చేయలేని విషయం వరకు సమస్యలు వచ్చాయి. అదేవిధంగా జాతీయ రహదారుల విభాగం పైన కూడా సమస్యల పై వినతులు వచ్చాయి.

ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఉపాధి పథకానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన 3,383 కోట్లు 2019-24 సంవత్సరాల మధ్య విడుదలైన నిధుల్లో రూ. 500 కోట్లు అవినీతి జరిగిందని, ఇందుకు ఆనాటి డ్వామా అధికారి శీనారెడ్డి కారకులని ఈదర మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ అవినీతి పై దర్యాప్తు చేయాలని కోరారు.

కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం, మర్లగూడెం, టెంపుల్లి గ్రామాలకు చెందిన రైతులు వీరపనేని గూడెం వద్ద ఉన్న ర్యాంప్ ను జాతీయ రహదారుల విభాగం కొనసాగించాలని కోరారు. అక్కడ ఐటి పార్క్ ఇచ్చారని అందువల్ల వీరపనేనిగూడెం వద్ద ఉన్న ర్యాంప్ తొలగించినందువల్ల నాలుగు కిలోమీటర్లు తిరిగి రావడంతో పాటు మధ్యలో రైల్వే గేటు వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి నేతృత్వంలో జాస్తి మురళీ తదితర రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు వద్ద గోపవరం గ్రామంలో వైసీపీ నేత భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని ఫిర్యాదులు చేశారు. కడప జిల్లాలో కొర్రపాటి పల్లిలో వైసీపి నేత ఒక హత్యకు పాల్పడితే ఈ సంఘటన పై పోలీసులు కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని బాదితులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, పార్టీ రాష్ట్ర మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలాకిషోర్, పార్టీ హెడ్ క్వార్టర్ ఇంఛార్జి శివామకుటం, వారధి సమన్వయకర్త కిలారు దిలీప్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరికలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ నేత, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలీ, దిగువమెట్ట సర్పంచ్ అంజినాయక్, మండల స్ధాయి వైసీపీ నేతలు పురందేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.