-మా భూములు చూసేందుకు వచ్చారు
-తర్వాత వైసీపీ నేతలు, రౌడీలు వచ్చి బెదిరించారు
-అధికారులు స్తంభాలు పాతేందుకు వచ్చారు
-కొత్త జీవో ప్రకారం మాది కాదంటున్నారని ఆవేదన
-కూటమి రక్షణ కల్పిస్తుందని పీతలమూర్తి భరోసా
-అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం
-భూరాంబందులను కటకటాల్లోకి పంపుతాం
-సీఎస్ బినామీ త్రిలోక్‌ను అరెస్టు చేయాలని డిమాండ్
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్‌రెడ్డి అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో బాధితులతో కలిసి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బాధితులు తమకకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
జవహర్‌రెడ్డి చూసి వెళ్లారు..
బాధిత రైతు అప్పన్న మాట్లాడుతూ జవహర్ రెడ్డి మా భూములు చూసి వెళ్లారు. అనంతరం అధికారులు, వైసీపీ నాయకులు, రౌడీలు వచ్చి భూమిని వదిలి వెళ్లాలని మమ్మల్ని బెదిరించారు. కొత్త జీవో ప్రకారం భూమి మాది కాదు అని అధికారులు అంటున్నారు.
స్తంభాలు పాతడానికి వచ్చారు..
బాధితురాలు చిట్టితల్లి మాట్లాడుతూ అధికారులు మా భూమిలో స్తంభాలు పాత డానికి వస్తే మేము అడ్డుకున్నాం. కోర్టుకు వెళ్లినా చెల్లదని అధికారులు, వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. అన్నవరం పంచాయితీకి చెందిన నాయకులు భూమి మాది అని అంటున్నారు. ఈనెల 20వ తేదీన మా భూములు చూసుకుని వెళ్లారు. అన్నవరం సర్పంచ్, ఎంపీటీసీలు రౌడీ ముఖాలను తీసుకువచ్చి మమ్మల్ని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
బినామీ త్రిలోక్‌ను అరెస్టు చేయాలి
పీతలమూర్తి యాదవ్ మాట్లాడుతూ.. జవహర్ రెడ్డి కుమారుడు బినామీల పేరుతో అసైన్డ్ భూములు కొట్టేశారు. జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు రెవెన్యూ అధికారులు..రైతులు భూములలో పోల్స్ వేయడానికి వచ్చారు. రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన అనుచరులు పేద రైతులు భూములు కొట్టేయడానికి బరితెగిస్తున్నారు. తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి రైతులు పక్షాన ఉంటుంది.. బాధితు లకు రక్షణ కల్పిస్తుంది. భూరాబందులను కచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తాం. రైతులకు తెలియకుండా భూములు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.
రెవెన్యూ విభాగం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని భూ దోపిడీలకు పాల్పడుతున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్‌ను వెంటనే అరెస్టు చేయాలి. వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళతాం. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. జీవో రాకముందే అసైన్డ్ భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. మంత్రి మేరుగు నాగార్జున, ఇన్‌చార్జ్ మంత్రి విడదల రజిని, ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, జవహర్ రెడ్డి అనుచరులు చేసిన భూ దోపిడీలపై ఆధారాలతో సహా బయటపెడతామని వెల్లడించారు.