బీజేపీ వైపు ఉద్యోగ సంఘాల చూపు?

– ఉద్యోగ సంఘాలు…బీజేపీ యూటర్న్‌
– సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అగౌరవం
– వేచి చూసీ చూసీ విసిగెత్తిపోయి…
– జేఏసీ మీటింగ్‌ పెట్టి అల్టిమేటం జారీ చేసినా కనీసం పట్టించుకోని రేవంత్‌
– టీఎన్‌జీవో, టీజీవోల అధ్యక్షులు, ముఖ్య నేతలంతా బీజేపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు
– ఇక బీజేపీ స్టాండ్ ?
– ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీలో బిజీ

( దండుగుల శ్రీనివాస్‌ )

కేసీఆర్‌ సర్కార్‌ అవమానపర్చింది. పట్టించుకోలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించాడు కేసీఆర్‌. దీంతో ఎన్నికల్లో గట్టి బుద్దే చెప్పాయి ఉద్యోగ సంఘాలు. కాంగ్రెస్‌కు సపోర్టు దొరికింది. అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడా అదే పరిస్తితి. అధికారంలోకి రాగానే ఏం అనలేదు.

కొంత సమయం ఇచ్చారు. ఉహూ.. పట్టించుకోరే. పైగా మీరంతా కేసీఆర్‌ మనుషులే అన్నారు. ఎలాగూ కక్షసాధింపు కాంగ్రెస్‌ కంటిన్యూ చేస్తోంది. అది ఉద్యోగ సంఘాలపైనా చూపుతున్నది. అందుకే వారు చెప్పింది పట్టించుకోవడం అటుంచి ఓసారి కూర్చుని మాట్లాడుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి.

చూసీ చూసీ విసిగి పోయి మూడు రోజుల కింద ఉద్యోగ జేఏసీ మీటింగొకటి పెట్టారు. డిమాండ్లు ముందుంచారు. అల్టిమేటం జారీ చేశారు. ఇలాగైనా కాంగ్రెస్‌ సర్కార్‌ దిగొస్తుందేమోనని. ఉహూ.. అయినా పట్టించుకోలేదు రేవంత్‌రెడ్డి. తను ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నాడు. పీసీసీ చీఫ్‌ను ఎవరిని చేయాలి..? మంత్రి వర్గంలోకి తన టీమ్‌ను ఎవరిని తీసుకోవాలి..? రుణమాఫీ చేస్తానన్న హామీ ఎలా అమలు చేయాలి..?? పాపం.. ఇవే టెన్షన్లలో ఉన్నాడు. ఇక లాభం లేదనుకుని అప్పటికే టచ్‌లో ఉన్న బీజేపీకి బాహాటంగానే దగ్గరయ్యేందుకు డిసైడ్‌ అయ్యారు. పోలోమని టీఎన్‌జీవో, టీజీవో అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు.

అక్కడ మన సీఎం ఎంత బిజీగా ఉన్నాడో.. వీళ్లు కూడా బీజేపీ నేతలను కలుస్తూ అంతే బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మీరు పట్టించుకోనప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ పంచన చేరి పనులు చేయించుకుంటే సరిపోతుంది.. అని పక్కా నిర్ణయానికి వచ్చేశారు వీరంతా.

టీఆరెస్‌కు ఎలా గుణపాఠం చెప్పామో తెలిసి కూడా రేవంత్‌ తమను తక్కువ చేసి చూడటం, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అవమాన పర్చడాన్ని ఇజ్జత్‌ కా సవాల్‌గా తీసుకున్నాయి ఉద్యోగ సంఘాలు. అందుకే బీజేపీ యూటర్న్‌ అయ్యాయి. ఇక లోకల్‌బాడీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కొంత బీజేపీ పవర్‌ పెంచే పనిని చేసి పెడతారన్నమాట ప్రతిఫలంగా. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు. రేవంత్‌ సర్కార్‌ను దెబ్బతీయటం, బీజేపీని బలోపేతం చేయడం.

సర్కార్‌ ఏర్పడి ఏడాది కాకముందే ఉద్యోగ సంఘాలు అధికార పార్టీకి దూరమవుతాయని ఎవరూ ఊహించలేదు. కానీ ఇక్కడ పరిస్థితులు గమనించిన సంఘ నేతలు.. తమను ఎప్పటికీ కేసీఆర్ మనుషులుగానే చూస్తారే తప్ప… సంఘ నేతలుగా గౌరవించరని వారు డిసైడ్‌ అయ్యారు. దీనికి తోడు ఈటల రాజేందర్ మధ్యవర్తిత్వం పనిచేసింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇన్‌కమ్‌టాక్స్‌ పెంపు,సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం అమలు తదితర అంశాలు కేంద్ర పరిధిలోకి పరిష్కారమవుతాయని ఈ గట్టువైపుకు మళ్లారు. ఈ పరిణామం రాష్ట్రంలో సర్కార్‌కు, ఉద్యోగ సంఘాలకు మధ్య ఘర్షణ వాతావరణాన్నే సృష్టించనుంది.