వినయ , విధేయ లోకేష్

ఎన్నో అవమానాలు , మరెన్నో అవహేళనలు , ముళ్ల మీద నడక , రాళ్లు పడినా ఆగని యాత్ర , భూమికి ఉన్నంత ఓర్పు , సముద్రానికి ఉన్నంత గంభీరత. తన 15 సం.ల రాజకీయ ప్రస్థానంలో ఇవన్నీ అధికమించి జనం మెచ్చిన రాజకీయ నాయకుడయ్యాడు. అయినా అదే వినయం , అదే విధేయత , అదే ఆప్యాయత , అదే కృతజ్ఞత . ఇదే కదా చంద్రబాబు ఆధ్వర్యంలో , కార్యకర్త కైనా , లోకేష్ కైనా నేర్పించిన తెలుగుదేశం సంస్కృతి. అందుకే ఆ పార్టీ జండా నీడలో ఎందరో కార్యకర్తలు సేదతీరుతున్నారు. అదే శిక్షణలో , యువగళం పాద యాత్ర ద్వారా ప్రజల ముందుకు వచ్చిన లోకేష్ లో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు బయటకు వచ్చిన ఒక ఆసక్తికర ఉదంతం నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం రోజున జరిగింది.

లోకేష్ ప్రమాణ స్వీకార అనంతరం సభలో పెద్దలకు అభివాదం చేసిన పిదప పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి పాదాభివందనం చేయబోతే వారించాడు పవన్. అయినా పట్టువదలక లోకేష్ పాదాభివందనం చేసి పవన్ ఆశీర్వాదం పొందాడు. ఇది ఒక్కసారిగా జనసైనికులను , టి.డి.పి కార్యకర్తలకు ఒకింత ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించింది. సాధారణంగా రాజకీయాలలో తనమీద ఆరోపణలు చేసిన వ్యక్తిమీద సహజంగా కోపం ఉంటుంది. 2014 – 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఒకానొక రోజు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ పై అవినీతి ఆరోపణ చేశాడు. అప్పటి వరకూ అలా పవన్ ఆరోపణ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అదే అదే నిదానంగా టి.డి.పి – జనసేన మధ్య అగాధం ఏర్పడి జనసేన టి.డి.పి తో విభేదించి పొత్తు నుండి వైదొలగి , బి.జె.పి కి దగ్గరయ్యింది.

2019 ఎన్నికల్లో జనసేన , బి.జె.పి తో పెట్టుకుని వేరుగా పోటీ చేసింది. టి.డి.పి ఓటమి చెంది ప్రతిపక్ష పాత్ర పోషించింది. కాలానుగుణంగా మారిన రాజకీయ పరిస్థితుల వల్ల , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా , టి.డి.పి తో పొత్తుకు జనసేనాని సుముఖం తెలపడం, అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించడం, పొత్తులోకి బి.జె.పి ని కూడా చేర్చే విధంగా జనసేనాని తన వంతు పాత్ర తాను పోషించాడు.

ఇప్పటి 2024 ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ఎటువంటి భేషజాలకు పోకుండా , కూటమిగా నిలచి , ఎ.పి చరిత్రలోనే అద్భుత విజయం సాధించారు. ఇక్కడ బి.జె.పి కొంత అటూ , ఇటూగా వ్యవహరించినా జనసేనాని మాత్రం బాబు వ్యూహాలకు బద్ధుడై , అభ్యర్థుల ఎంపిక , స్థానాల ఎంపికల్లో కూడా బాబు మాటకు విలువ ఇస్తూ క్రమ శిక్షణ గల సైనికుడిగా వ్యవహ రించాడు. దానితో 21 + 2 మొత్తం నూటికి నూరు శాతం జనసేన పార్టీకి ఫలితాలు దక్కాయి. అదే విధంగా రాష్ట్రం అంతా జనసేన , టి.డి.పి ఓట్ల షేరింగ్ లో ఎక్కడా పొరపొచ్చాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ జరిగింది. అదే నిన్న సభలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది.

చిరజీవి – పవన్ కుటుంబాలు, చంద్రబాబు – ఎన్.టి.ఆర్ కుటుంబాలు కలసిమెలసి ఒక వేడుకలా సభను ఆస్వాదించారు. లోకేష్ పెద్దల పట్ల గౌరవంతో వ్యవహరించిన తీరు , పవన్ ఎడల గతకాలపు ఛాయలను మనసులో పెట్టుకో కుండా ఆయన ఆశీర్వాదం తీసుకున్న తీరు సభికులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇదే విధంగా కూటమి ఐకమత్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాలని సర్వత్రా చర్చించు కోవడం కనిపించింది.

వి. ఎల్. ప్రసాద్