వివేకానందుడి మాటలు తరతరాలకు స్ఫూర్తి మంత్రాలు..

  • సమాజానికి నూతనోత్తేజం నింపే ఆణిముత్యాలు
  • మధ్యాంధ్ర శ్రీ రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 5వ భక్తి సమ్మేళనం లో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం/నిడదవోలు: వివేకానందుని ప్రసంగాలు, రామకృష్ణ పరమహంస జీవన విధానం బాల్య దశలోనే చదివితే, ఆకలింపు చేసుకుంటే భవిష్యత్తు జీవితం బంగారం మయం అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం 09:30 గంటలకు నిడదవోలు పట్టణం లోని ఆడిటోరియం నందు “మధ్యాంధ్ర శ్రీ రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 5వ భక్తి సమ్మేళనం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు..

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు… గంజాయ్ మత్తులో కొందరు యువత నిర్వీర్యం అయిపోతుందని, భావి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.. సరైన సమయంలో, సరైన వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రామకృష్ణ -వివేకానంద భావ ప్రచార పరిషత్ ను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.. ప్రస్తుత సమాజ పరిస్థితులు పెడ ధోరణిలో వెళుతున్న తరుణంలో కొందరు యువత సోషల్ మీడియాను రకరకాలుగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు అవుతున్నారన్నారు. ప్రస్తుత సమాజం ఉన్న పరిస్థితుల్లో రామకృష్ణ పరమహంస వ్యాఖ్యలు, వివేకానందుడి ఆలోచనలు మళ్లీ సమాజాన్ని మంచి మార్గం వైపు తీసుకువెళ్తాయని ఆశిస్తున్నానన్నారు.. కాలాలు మారినా, తరాలు మారినా వివేకానందుడి మాటలు సజీవంగా ఉంటాయన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, తత్త్వచింతనను, గొప్పతనాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ధీశాలి స్వామి వివేకానందుడనీ.. ఆయన మాటలు సమకాలిన సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయన్న మంత్రి దుర్గేష్ యువతకు స్ఫూర్తిగా, మార్గ నిర్దేశకుడుగా నిలిచిన స్వామి వివేకానంద పుట్టినరోజుని జాతీయ యువజన దినోత్సవం గా ప్రతి ఏటా జనవరి 12న జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వివేకానందుని వ్యాఖ్యలు, ప్రవచనాలకు పునరంకితమవుతామని చాటి చెప్పేందుకు జాతీయ యువకుల దినోత్సవంగా జరుపుతున్నామన్నారు.. వివేకానందుడి బోధనలు యువతకు స్ఫూర్తినిస్తాయన్నారు.. ఆయన ప్రసంగాలు ఈ యువకుల్లో చైతన్యాన్ని రగిలిస్తాయన్నారు..

అదే విధంగా ఆధ్యాత్మిక భావనలను, ఆచరణాత్మకతను అక్షరాల ఆచరించి చూపిన రామకృష్ణ పరమహంస, వివేకానందుడు చరిత్రను ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి చదవాలని సూచించారు.. కాలక్రమంలో పుస్తక పఠనం తగ్గుతున్న నేపథ్యంలో విజ్ఞానం కూడా క్రమక్రమంగా తగ్గుతుందన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు.. వివేకానందుడి చరిత్రను చదవడం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందన్నారు.. ఈ తరహా కార్యక్రమాలు త్వరలో పలాసలో, రాయలసీమలో చేస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా చేయడం వల్ల యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అవకాశం కలుగుతుంది అన్నారు..

ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.. సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడంలోనే మన గొప్పదనం తెలుస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు..అలాంటి శాఖకు మంత్రిగా తాను వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వివేకానందుడి, రామకృష్ణ పరమహంస జీవన విధానాలను పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాలుగా రూపొందించారన్నారు.. వాటన్నిటిని పఠించడం ద్వారా సమాజాన్ని మనల్ని పునీతులు చేసుకోవాలని తెలిపారు..