రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్
విజయవాడ, మహానాడు : గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావులు అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాలు చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి,ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు. గౌరవ వేతనం ప్రతి నెల వారి సొంత అకౌంట్లోకి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మాదిరే గ్రామాలలో పని చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులను 90%–10% రేషియోతో అవకాశం ఇవ్వాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల దర్శనానికి అవకాశం కల్పించాలని తీర్మానాలు చేశారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, తదితర సభ్యులు పాల్గొన్నారు.