‘వాకాడ’ కొత్త నాటకం!

– రూ.75 కోట్ల చెక్ బౌన్స్ కేసులో తిరుమలరావు నిందితుడు
– తిరిగి తనకే సొమ్ము చెల్లించాలని హడావుడి
– ముక్కున వేలేసుకుంటున్న స్థానికులు

విజయవాడ, మహానాడు: కాంట్రాక్టరుగా విఫలమై, చెక్కులు ఇచ్చి అవి బౌన్స్ కావటంతో రకరకాలుగా బెదిరింపులకు దిగి పోలీసు కేసులు ఎదుర్కొంటున్న నిందితుడు వాకాడ తిరుమలరావు ఇప్పుడు తనకే డబ్బివ్వాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. చెక్ బౌన్స్ కేసులు కోర్టు విచారణకు రావటంతో మీడియాకెక్కి నానా యాగీ చేస్తున్నాడు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టున్న అతడి కథ ఇది….

రూ. 75 కోట్ల కు పైగా చెక్కులు ఇచ్చి, చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కుంటున్న వాకాడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఇప్పుడు మరింత దిగజారుడుతనం ప్రదర్శించాడు. పేరు మోసిన నిర్మాణ సంస్థ ఆదిత్య మీద బురద చల్లటానికి నాలుగైదు నెలల నాటి ఎఫ్ ఐ ఆర్ ను చూపిస్తూ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా 75 కోట్ల 16 లక్షల రూపాయల చెక్కులు బౌన్స్ చేశాడు. 2023 లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. ఆ తరువాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకూ నాలుగు సార్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి.

ఇంత జరిగాక .. తనకే డబ్బులివ్వాలివ్వాలంటూ మొన్న ఏప్రిల్ 27 న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆ ఎఫ్ ఐ ఆర్ చూపిస్తూ ఆదివారం మీడియాలో హడావుడి చేశాడు. రూ.75 కోట్ల 16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి ఆరు నెలల తరువాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్టు అర్థం లేని ఫిర్యాదు చేయటం విచిత్రమని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. పేరు ప్రతిష్ఠలున్న సంస్థ మీద, వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి పూనుకోవటం అతగాడి దిగజారుడు తనానికి నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.