-నమ్మిన బాటకే కట్టుబడిన రవీందర్, మహేందర్
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ బాటలో తమ పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్‌రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా నమ్మి నడిచిన బాటకే జై కొట్టారు. తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార బ్యాంకులను అద్భుతంగా నడిపిన వీరి పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుంది. పదివేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్కాబ్‌ను 42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్ది వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారు. టెస్కాబ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి అనేక అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్‌గా నిలిచింది. వారి రాజీనామా, నాయకత్వ లేమి రాష్ట్ర కోపరేటివ్ రంగానికి తీరని లోటు అవుతుంది. అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధుల ను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తుందని వ్యాఖ్యానించారు.