చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు

– అభ్యంతరాలు తెలిపేందుకు 15మందితో ప్రత్యేక కమిటీ
– హైదరాబాదులో జరిగిన జేపీసీ సమావేశంలో ఏపీ కమిటీ సభ్యులు పలు సూచనలు
– రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి, మహానాడు: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు-2024 పై ముస్లిం సమాజం నుంచి వివిధ రూపాల్లో పలు ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ నిమిత్తం బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసి) వెళ్లేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేశారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్వహించే అభిప్రాయ సేకరణ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యంతరాలను తెలిపేందుకు 15 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసిందని పేర్కొన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ నిమిత్తం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రల పర్యటన చేపట్టింది. శనివారం హైదరాబాద్ తాజ్ కృష్ణలో జేపీసీ ఛైర్​పర్సన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. జేపీసీ కమిటీ ముందు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక​ పాల్ కు ఆయా రాష్ట్రాల తరఫున వినతిపత్రాలు అందజేశారు. ఏపీ తరఫున నియమించిన 15 మందితో కూడిన ప్రతినిధుల కమిటీ సభ్యులతో వక్ఫ్ సవరణ బిల్లు పై అభిప్రాయాలు వెల్లడించేందుకు జేపీసీ సమావేశానికి ముందుగా మంత్రి ఫరూక్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు వెళ్లేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు యావత్ ముస్లిం సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

రాష్ట్రం తరఫున అత్యంత పటిష్ఠంగా, సాంకేతికపరమైన, సున్నితమైన అంశాలపై వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లింలకు మేలు చేకూర్చే అంశాలను సమర్థిస్తూనే, వివాదాస్పద మైనటువంటి బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలను తెలియజేయడం జరిగిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పై అభిప్రాయ సేకరణ సమావేశంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐఏఎస్‌, ఉన్నతాధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు, న్యాయవాద సంఘం, ముతావల్లిల సంఘం, మైనార్టీ సంక్షేమం, హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సేవా సంస్థలు, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులను భాగస్వామ్యం చేస్తూ కమిటీ సభ్యులను నియమించి జేపీసీలో పలు కీలక అంశాలను లేవనెత్తినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఫరూక్ పేర్కొన్నారు.