– మంత్రి నారాయణ
విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తె సింధూర మంగళవారం పర్యటించారు. కుందావారి కండ్రిక, పాత పాయకాపురం లో వరద ముంపు ప్రాంతాలు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వరద నీటిని బయటకు పంపేందుకు భారీ యంత్రాలతో రోడ్లకు గండ్లు కొట్టించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నారాయణ ఏమన్నారంటే.. వరద ముంపు ప్రాంతాల్లో 10 వేల మంది శానిటేషన్ సిబ్బంది శరవేగంగా పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 26 డివిజన్లలో పూర్తిగా నీరు తగ్గిపోయింది. మిగిలిన డివిజన్లలో కూడా రేపటిలోగా నీరు మొత్తం తగ్గిపోతుంది. నీరు తగ్గిన వెంటనే పారిశుద్ధ్య పనులు ప్రారంభిస్తాం.
గురువారం సాయంత్రానికి మొత్తం శానిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. త్వరలోనే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసి పరిహారం అందిస్తాం.