ఆడపిల్లల భద్రతకు కట్టుబడి ఉన్నాం

* మహిళల విషయంలో తప్పు చేస్తే సహించేది లేదు
* గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన బాధాకరం
*ముఖ్యమంత్రి చొరవతో అధికార యంత్రాంగమంతా రంగంలోకి దిగింది
* త్వరలోనే నిజానిజాలు తేల్చి చర్యలు తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర

గుడ్లవల్లేరు: ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలున్నాయనే ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్ధినులు ఆందోళన చెందుతున్నారనే వార్త రాగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న రాత్రే జిల్లా యంత్రాంగాన్ని ఇంజనీరింగ్ కాలేజీకి పంపించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారన్నారు. ఘటనా స్థలికి వెళ్లి సమస్యను పరిశీలించాలని ఆదేశించారని తెలిపారు.

కెమెరాలు ఉన్నాయనే విషయం రెండు రోజుల క్రితమే తెలిసిందని, వార్డెన్, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం కారణంగానే ఆందోళనకు దిగామని విద్యార్ధులు తెలిపారు. ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరం. పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఐదుగురు మహిళా అధికారుల బృందాన్ని నియమించిందన్నారు.

ఏవైనా రికార్డింగ్స్ సెల్ ఫోన్లలో ట్రాన్స్ ఫర్ అయ్యాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్దారణకు రాలేదని, అనుమానాలున్న మాట వాస్తవమేనని మంత్రి తెలిపారు. ఆడ పిల్లల విషయంలో తప్పు చేయాలంటే భయపడేలా బాధ్యులపై చర్యలుంటాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.