Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం

• ప్రజలంతా మెచ్చేలా, భావితరాలకు స్ఫూర్తి పంచేలా కూటమి పాలన
• శాంతిభద్రతలను పటిష్ఠంగా అమలు
• మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం
• గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు
• లక్ష మంది యువతను సేంద్రియ రైతులుగా మారుస్తాం
• పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలి
• అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల్లో మేటిగా ముందుకు సాగుతాం
• కాకినాడలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌

కాకినాడ, మహానాడు: ‘ఇంటి నుంచి నిర్భయంగా బయటకు వెళ్లిన ప్రతి ఆడబిడ్డ అంతే భద్రంగా ఇంటికి తిరిగి రావాలి… దోపిడీలు, దౌర్జన్యాలు నశించే రోజులు సాకారం కావాలి. రాజీలేకుండా శాంతిభద్రతలు బలంగా అమలు జరగాలి… యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అవ్వాలి… ఒక్కరి వద్దే మొత్తం డబ్బులన్నీ జమయ్యే పద్ధతి పోవాలి.. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి.. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గ సీమగా విరజిల్లాలి… ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధితోపాటు సంక్షేమ రథం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి… ఇవే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలు’ అని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ప్రజలు ఇచ్చిన అధికార బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, వారు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా నెరవేర్చుతామన్నారు. రాష్ట్రానికి తిరిగి జీవం పోసేలా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి బ్రాండ్ గా చేసేందుకు అన్ని విధాలా పాలనలో మార్పు తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలకు పునర్వైభవం తీసుకురావడంతోపాటు, ఆర్థికంగా అతలాకుతలం అయిన రాష్ట్రానికి జీవం పోసేలా వేగంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం వారికి శిక్షపడాలని పవన్ పేర్కొన్నారు.

కాకినాడలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర వేడుకలకు పవన్ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. జిల్లా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ ను తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకట ప్రదర్శన, చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పవన్ కల్యాణ్‌ మాట్లాడారు.

78 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దేశం తన ప్రయాణాన్ని సాగించింది. విభజన గాయాలు, యుద్ధాలు, క్షామం వంటివి దేశం చూసింది. మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి దార్శనికుడు పాలనతో భారతదేశం ప్రయాణాన్ని మొదలుపెడితే తర్వాత దేశాన్ని అంతే సమర్థంగా పాలించిన లాల్ బహుదూర్ శాస్త్రి, అపర దుర్గగా పేరు గాంచిన ఇందిరా గాంధీ, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిన గొప్ప నేత పీవీ నరసింహారావు, పోఖ్రాన్ లో అణు బాంబు పరీక్ష చేసి శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన అటల్ బిహారీ వాజ్ పేయి, పాతతరం నేతల్లా కాకుండా మా దేశం మీద దాడి చేస్తే మీకు అదే తరహాలో సమాధానం చెబుతామని నిరూపించిన ప్రధాని నరేంద్ర మోదీ వరకు ఈ దేశం ఎందరో గొప్ప నేతలను చూసింది.

స్వాతంత్య్ర దినోత్సవం అంటే చాక్లెట్లు పంచుకోవడానికో, సెలవు దినంగా ఎంజాయ్ చేయడానికో కాదు. దేశం కోసం పోరాడిన ఎందరో త్యాగధనులు, వారి పోరాటాలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. 19 ఏళ్ల ఖుదిరాం బోస్ త్యాగం దగ్గర నుంచి 23 ఏళ్ల భగత్ సింగ్ వంటి యువకుల బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నాం. వారు తీసుకొచ్చిన స్వేచ్ఛను అంతే బాధ్యతతో భావితరాలకు అందించాలి. 1925లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ఓ అపురూప ఘట్టం. ఉప్పు సత్యాగ్రహంలోనూ ఉప్పాడ, చొల్లంగి గ్రామాల్లో ప్రజలు అశేషంగా పాల్గొన్నారు. కాకినాడకు చెందిన ప్రతివాది భయంకరాచారి, బులుసు సాంబమూర్తి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ వంటి జిల్లాకు చెందిన ఎందరో గొప్ప వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి గొప్ప నేలలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ కు పునరుజ్జీవం

సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. 28 కేటగిరిల్లో ప్రజలకు సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పెంచింది. కాకినాడ జిల్లాలో 17 కేటగిరిల్లో 2,77,594 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నాం. ఆంధ్రుల అన్నపూర్ణగా భావించే డొక్కా సీతమ్మ పథకంతో జిల్లాలోని 1258 పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. అన్నా క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి పేదలకు రూ.5లకే భోజనం అందించే కార్యక్రమం మొదలుపెట్టాం. జిల్లాలో మొత్తం 11 క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇసుక విధానంలో మార్పులు చేసి, ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా యూనిట్ కు రూ.4 లక్షలు అందజేస్తాం. పెండింగ్ లో రూ.49 కోట్లు బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 37 కౌంటర్లలో ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్నాం.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం

పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి, సర్పంచుల వ్యవస్థకు గౌరవం తీసుకురావడం, నిధుల కొరత నుంచి బయటపడేయడంపై దృష్టి సారించాం. గత 34 ఏళ్లుగా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు ఇస్తున్న రూ.100ల నిధులను రూ.10 వేలు చేశాం. మేజర్ పంచాయతీలకు రూ.250 నిధులను రూ.25 వేలు చేశాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్ధంగా వినియేగించుకునేలా, అంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకునేలా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీటి పథకం అమలకు జల్ జీవన్ మిషన్ నిధులను సమర్ధంగా వినియోగించుకుంటాం. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ నిధుల్లో రూ.4 వేల కోట్లు కేవలం పైపులైను పనులకు వినియోగించారు. దీనివల్ల ఎవరికీ లాభం లేకపోయింది. నిధులను దుర్వినియోగం చేసే వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. యువతకు నైపుణ్యాల అభివృద్ధి కోసం దృష్టి సారించి వారికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది లక్ష్యం. దానికి అనుగుణంగా పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలకు అనువుగా రాష్ట్రాన్ని తయారు చేస్తాం.

శాంతిభద్రతలు బలంగా ఉంటేనే అభివృద్ధి

రాష్ట్రంలో బలంగా శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఉపాధి పెరుగుతుంది. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనూ దీన్ని స్పష్టం చేశాం. శాంతిభద్రతల అమలులో ఎక్కడా రాజీపడొద్దని గట్టిగా చెప్పాం. టూరిజం, వైద్యం, పరిశ్రమల రంగంపై దృష్టి పెట్టడం ద్వారా ఉపాధిని కూడా యువతకు పెంపొందించవచ్చు. పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భరోసాను ఇస్తాం. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో బ్లూ ఎకానమీ సృష్టించే అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అందరికీ సంపద అనేది ముఖ్యం. అన్ని రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో నడవాలి. యువత భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండాలి. వారి ప్రతిభకు సరైన దారి చూపించాలి. లక్ష మంది యువ సేంద్రీయ రైతులను తయారు చేయాలనే ఆలోచన ఉంది. వారు గ్రామాల్లో చేసే వ్యవసాయం కొత్త దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడే వారిపై నిఘా పెడతాం

గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. మాదక ద్రవ్యాలు, గంజాయి రాష్ట్రమంతటా పాకింది. దీన్ని నివారించాలి. యువతను గంజాయి మత్తు నుంచి బయటకు తీసుకురావాలి. మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించాలి. సోషల్ మీడియాలో మహిళలను, ఆడబిడ్డలను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడే వారిపై నిఘాపెడతాం. పోస్టుల దగ్గర నుంచి మెసేజుల వరకు ఆడబిడ్డలపై వేధింపులకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదు. మహిళలపై దాడులు, నేరాల నివారణకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి కట్టుబడి పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ విషయంలో స్వేచ్ఛగా పని చేసేలా చూస్తాం. ఆడబిడ్డల రక్షణకు, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటాం.

ఏడీబీ నిర్మించలేదుగానీ రుషికొండ కోటకు రూ.650 కోట్లు ఖర్చు చేశారు

రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వచ్చే ఏడీబీ రోడ్డు నిర్మాణానికి రూ.390 కోట్ల ఖర్చు అవుతుంది. దీనివల్ల ఎందరికో మేలు జరుగుతుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ పనులను గత ప్రభుత్వం పట్టించుకున్నదే లేదు. రూ.650 కోట్లు ఖర్చు చేసి రుషికొండలో కోటను నిర్మించారు. ప్రజలకు అవసరం అయిన విషయాలపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. కచ్చితంగా ఏడీబీ రోడ్డు సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం. అలాగే శేషాచలంలో దొరికే ఎర్రచందనంను స్మగ్లర్లు అక్రమంగా నరికేసి తీసుకెళ్తుండగా కర్ణాటక పోలీసులు రూ.140 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుకున్నారు. దాన్ని కనీసం మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చే చర్యలు గత ప్రభుత్వంలో లేవు. ఇక జల్ జీవన్ మిషన్ నిధుల్లో అపారమైన అవినీతి జరిగింది. ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేసి, జేబులో వేసుకున్న వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం.

ప్రజలు ఇచ్చిన బలమైన బాధ్యతను వారికి మేలు చేసేలా ముందుకు తీసుకెళ్తాం. యువతకు భవిష్యత్తు చూపేలా, భావి తరాలకు స్ఫూర్తి నింపేలా కూటమి పాలన సాగుతుంది. ఇస్రో తన సిద్ధాంతాల్లో – ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం కూడా ఒకటిగా పెట్టుకుంది. నాకు అది తెలియగానే ఆనందం కలిగింది. రాజకీయాల్లోనూ కొత్త నాయకత్వం రావాలి. వచ్చే తరానికి నాయకుల్ని తయారు చేసే బాధ్యతను ఇప్పటి నాయకత్వం తీసుకోవాలి. భవిష్యత్తు మొత్తం యువత చేతిలో ఉంది. వారిని ఎప్పటికప్పుడు ప్రొత్సహించేలా, రాజకీయాల్లోనూ వారిని ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తాం. యువతకు అద్భుతమైన భవిష్యత్తు అదించేందుకు నిరంతరాయంగా ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.