మన పల్లెలను మనమే కాపాడుకోవాలి

– కొల్లిపర మండలంలో రోడ్ల పనులకు మంత్రి నాదెండ్ల శంకుస్థాపన

కొల్లిపర, మహానాడు: కొల్లిపర మండలంలోని, హనుమాన్ పాలెం, అత్తోట, తూములూరు, అన్నవరం, సిరిపురం గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా రెండు కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ ఆలోచనలతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ విభాగం నుంచి 13 వేల 362 పంచాయతీల్లో 4500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం గొప్ప విషయం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే విధంగా రోడ్లు, డ్రైన్లు, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా మంచి ప్రణాళికతో కలిసి కట్టుగా ముందుకు వెళ్తామని చెప్పారు.

ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడే ఉపాధి కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని దానికి తగ్గ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. యువతకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతీవాచీతో స్వాగతం పలుకుతామని, మన సంస్కృతిని పల్లెటూర్ల వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొల్లిపర మండలంలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారని, రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ హబ్ గా ఏర్పాటుకు తగిన కృషి చేస్తానని తెలిపారు.