వ్యాపారులకు అండగా ఉంటాం

కూటమి ప్రభుత్వంలో వేధింపులు ఉండవు
స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు
ఆర్యవైశ్యుల సమావేశంలో లావు, చదలవాడ భరోసా

పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : తాము అధికారంలోకి వస్తే వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని, ట్యాక్స్‌ల పేరుతో ఇబ్బందులు పెట్టమని, ఎలాంటి కప్పం కట్టాల్సిన అవసరం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అభయమి చ్చారు. ఆదివారం నరసరావుపేటలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అభ్యర్థుల వ్యక్తిత్వం చూడాలని, మేము దోచుకోవడానికి దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. ఈ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించాలని సేవ చేయాలని వచ్చామని, ఎవరో బలవంతంగా పోటీ చేయమంటే చేయడం లేదన్నారు. ఈ ప్రాంత సమస్యలు తెలుసు…అసంపూర్తిగా ఉన్న శాశ్వత తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తన లక్ష్యమని వెల్లడిరచారు.

వ్యాపారులను అధికారులు, ప్రజా ప్రతినిధుల పేర్లతో వేధించమని, ఎవరికీ కప్పం కట్టాల్సిన పనిలేదని తెలిపారు. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యాపారులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వేచ్ఛగా ఆర్యవైశ్యులు ఇతర వ్యాపార వర్గాలు వ్యాపారాలు చేసుకునే సమయం దగ్గరలోనే ఉందన్నారు. తమకు ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గుప్తా, ఆర్య వైశ్య ప్రముఖులు కపిలవాయి విజయ్‌కుమార్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.